వాషింగ్టన్ : తాజాగా జూమ్ సంస్థ 1300 మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. కరోనా మహమ్మారి సమయంలో ఐటీ సంస్థల వర్క్‌ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కలిగించడంతో .. జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలకు డిమాండ్ పెరిగింది. దీంతో అధిక సంఖ్యలో ఉద్యోగులను తీసుకుంది. డిమాండ్‌ను అందుకోవడానికి 24 నెలల వ్యవధిలో ఉద్యోగుల్ని 3 రెట్లు ఎక్కువగా నియమించుకుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఖర్చులను తగ్గించుకునేందుకు భారీగా ఉద్యోగులపై వేటు వేస్తోంది.
తన వర్క్‌ఫోర్స్‌లో 15 శాతం లేదా 1300 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ సిఇఒ ఎరిక్ యువాన్ మంగళవారం ఒక బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. కరోనా సమయంలో ఇంటి దగ్గర నుంచి పనిచేసేవారు ఎక్కువైన నేపథ్యంలో.. డిమాండ్‌కు తగ్గట్లుగా ఎక్కువ మందిని నియమించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వారిని పంపించక తప్పట్లేదని ఆయన వివరణ ఇచ్చారు. కంపెనీ ఖర్చును తగ్గించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తన వేతనంలో ఏకంగా 98 శాతం కోత విధించుకున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితికి జవాబుదారీగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, 2023లో కార్పొరేట్ బోనస్‌ను కూడా వదులుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్స్ టీమ్ కూడా తమ కనీస వేతనాలను 20 శాతం మేర తగ్గించుకుంటున్నాయని అన్నారు. ఉద్యోగం కోల్పోయిన వారికి 16 వారాల వేతనం, హెల్త్‌కేర్ కవరేజీ, యాన్యువల్ బోనస్ అందుతాయని ఆయన అన్నారు.
ఇటీవల అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, గూగుల్, మెటా వంటి కంపెనీలు కూడా వేలల్లో ఉద్యోగుల్ని తొలగించాయి. దేశీయ సంస్థలైన విప్రో, ఇన్ఫోసిస్‌లు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే.










