Nov 22,2023 12:59

చెన్నై : హీరోయిన్‌ త్రిషపై నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి విదితమే. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. మన్సూర్‌ పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. దీంతో అతడిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. త్రిషపై అసభ్యకరమైన కామెంట్స్‌ చేసిన నేపథ్యంలో ఐపిసి లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

తాజాగా ... ఈ విషయంపై ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మన్సూర్‌ అలీఖాన్‌ త్రిషకు క్షమాపణలు చెప్పబోనని అన్నారు. తాను తప్పుగా ఏం మాట్లాడలేదన్నారు. తానేంటో తమిళనాడు ప్రజలకు తెలుసని, వారి మద్దతు తనకు ఉందని చెప్పారు. 'సినిమాల్లో హత్య చేస్తే నిజంగానే చేసినట్లా ? సినిమాల్లో రేప్‌ చేస్తే నిజంగానే చేసినట్లా ?' అంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. మన్సూర్‌ అనుచితంగా మాట్లాడారంటూ దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల అసోసియేషన్‌ (నడిగర్‌ సంఘం) అతడిని పాక్షికంగా నిషేధించింది. సోషల్‌ మీడియాలో త్రిషకు మద్దతుగా సినీ, రాజకీయ ప్రముఖులు పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా చిరంజీవి ఆమెకు మద్దతుగా ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టారు. ఇలాంటి పరిస్థితులు ఏ ఆడపిల్ల ఎదుర్కొన్నా తాను అండగా ఉంటానన్నారు.

కోలీవుడ్‌ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ఎన్నో రేప్‌ సీన్లలో నటించానని.. 'లియో'లో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందని భావించినట్లు చెప్పారు. ఆ సన్నివేశం లేకపోవడంతో బాధగా అనిపించిందన్నారు. ఈ వ్యాఖ్యలపై త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి వల్లే పరిశ్రమలోని అందరికీ చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. అతడితో నటించే అవకాశం రాకపోవడం సంతోషకరమన్నారు.