టిటిడిలో 114 జిఒ అమలుకు గ్రీన్ సిగల్
స్విమ్స్‌లో రూ.197 కోట్లతో భవనాలు నిర్మాణం
టిటిడి పాలకమండలి నిర్ణయం
ప్రజాశక్తి - తిరుమల : కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు టిటిడి పాలకమండలి అంగీకారం తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న ప్రభుత్వ జిఒ నంబర్ 114 మేరకు అర్హత ఉన్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని పాలకమండలి ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా పాలకమండలిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను చైర్మన్ వెల్లడించారు. ఈ నెల 23 నుంచి అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని నిర్వహించనున్నామని, హోమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తామని, హోమంలో పాల్గనే యాత్రికులు రూ. వెయ్యి చెల్లించి టికెట్టు పొందవలసి ఉంటుందని తెలిపారు. టిటిడి ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించిన వడమాలపేట వద్ద గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి రూ.25.67కోట్లు కేటాయిస్తున్నామని, ఈ సొమ్మును తిరిగి ఉద్యోగులు నుంచి రీయింబర్స్ చేసుకుంటామని చెప్పారు. టిటిడిలో పని చేసే ప్రతి ఉద్యోగికి ఇంటిస్థలం కేటాయిస్తామన్నారు. అర్హత ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేస్తామని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కాంట్రాక్ట్, కార్పోరేషన్ పరిధిలో ఉన్న ఉద్యోగులను అర్హత మేరకు రెగ్యులరైజ్ చేస్తామని ఇఒ ధర్మారెడ్డి తెలిపారు.
మరికొన్ని నిర్ణయాలు
టిటిడి ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా రూ.14 వేలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.6850 ఇవ్వాలని ఆమోదం.తిరుపతిలోని రామ్‌నగర్ క్వార్టర్స్ అభివృద్ధి పనులకు రూ.6.15 కోట్లు కేటాయింపు. ప్రసాదాలు, ముడిసరుకులు నిల్వ ఉంచడానికి రూ.11కోట్లతో అలిపిరి వద్ద గోడౌన్లు
నిర్మాణానికి నిధులు మంజూరు.
మంగళం నుంచి రేణిగుంట వరకు రోడ్డు అభివృద్ధి పనులకు రూ.15 కోట్లు, ఎంఆర్‌పల్లి జంక్షన్ నుంచి అన్నమయ్య వరకు రోడ్డు అభివృద్ధి పనులకు రూ.4.5 కోట్లు, పుదిపట్ల జంక్షన్ నుంచి వకులమాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణానికి రూ.21 కోట్లు కేటాయింపుకు ఆమోదం. ఆయుర్వేద హాస్పిటల్‌లో రూ.1.65 కోట్లతో నూతన భవనం నిర్మాణం. రుయాలో టిబి రోగుల కోసం రూ.1.79కోట్లతో నూతన వార్డు నిర్మాణం. స్విమ్స్‌లో రూ.3.35 కోట్లతో నూతన భవనాలు నిర్మాణం. స్విమ్స్‌లో నూతన కార్డియో, న్యూరో బ్లాక్‌ల ఏర్పాటుకు రూ.74 కోట్లు కేటాయింపు. స్విమ్స్‌లో రూ.197కోట్లతో
నూతన ఆధునాతమైన భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు.
నడకదారిలో యాత్రికులు భద్రత కోసం రూ.3.5 కోట్ల వ్యయంతో ట్రాప్ కెమెరాలు కొనుగోలు. కరీంనగర్‌లో పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి రూ.15.54 కోట్లు కేటాయింపు. ప్రాచీనకళలు ప్రోత్సహించడానికి కలంకారి, శిల్పకళల కోసం సాయంకాలం కోర్సులు ప్రారంభానికి ఆమోదం.