ప్రజాశక్తి- తిరుపతి సిటీ : తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సూర్య, చంద్రప్రభ వాహనాలపై పద్మావతి అమ్మవారిని ఊరేగించారు. చివరి రోజైన శనివారం జరగనున్న పంచమి తీర్థం ఏర్పాట్లను టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి, జిల్లా ఎస్‌పి పరమేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇఒ మీడియాతో మాట్లాడుతూ.. పంచమి తీర్థం నిర్వహణకు అవసరమైన పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. తిరుపతి నుంచి తిరుచానూరుకు వచ్చే మార్గంలో యాత్రికులకు జర్మన్ షెడ్లు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు పద్మ పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నట్టు చెప్పారు. అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో నవంబరు 23 ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం ప్రారంభమవుతుందని తెలిపారు.