తిరుపతి : తిరుమల కళ్యాణకట్టలో ఎన్నో ఏళ్లుగా కెఓడి (కెప్ట్ ఆన్ డ్యూటీ) పేరుతో క్షురకులను వేధింపులకు గురి చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని తక్షణం కెఓడి విధానాన్ని కళ్యాణ కట్టలో రద్దు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రకటించారు.
మంగళవారం ఉదయం పద్మావతిపురంలోని తన నివాసంలో కలవడానికి వచ్చిన తిరుమల కళ్యాణకట్ట క్షురకులతో టిటిడి చైర్మన్ సంభాషించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కళ్యాణకట్ట క్షురకులు, మహిళా క్షురకులు తమ ఆవేదనను చైర్మన్ కు పూసగుచ్చినట్టు వివరించారు. ఈ విషయం తన దఅష్టిలో లేదని తప్పనిసరిగా సమస్య పరిష్కారానికి తాను తోడ్పడుతానని, తొలగించిన అందరినీ పనుల్లోకి తీసుకోవాలని ఆదేశిస్తానని ప్రకటించారు. కళ్యాణకట్ట డిప్యూటీ ఇఓ సెల్వంకు ఫోన్ చేసి కేఓడి విధానాన్ని రద్దు చేయాలని, తొలగించిన వారినందరినీ పనుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. కళ్యాణకట్టలో ఖాళీగా ఉన్న పోస్టులలో 114 జీఓ ప్రకారం అర్హులైన క్షురకులను రెగ్యులర్ చేయడానికి తమ బోర్డు కట్టుబడి ఉంటుందని కట్ ఆఫ్ ఇయర్ 2014 కాకుండా ముఖ్యమంత్రితో మాట్లాడి అదనంగా అవసరమైతే సమయాన్ని పెంచనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, మేళ్లచెరువు గంగులప్ప, శ్రీవారి కల్యాణ కట్ట నాయి బ్రాహ్మణ సంఘం నేతలు శ్రీహరి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.