Nov 04,2023 08:18
  • కాంట్రాక్టు నియామకాలు రద్దు చేయండి
  • ఢిల్లీలో గర్జించిన ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లు
  • రామ్‌లీలా మైదానంలో వేలాది మందితో భారీ ర్యాలీ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోగా జాతీయ పింఛను పథకం (ఎన్‌పిఎస్‌)ను రద్దు చేసి పాత పింఛను విధానాన్ని (ఒపిఎస్‌ను) పునరుద్ధరించకుంటే కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నేతలు హెచ్చరించారు. కాంట్రాక్టు నియామకాలను రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. శుక్రవారం నాడిక్కడ రామ్‌లీలా మైదానంలో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ సెంట్రల్‌ గవర్నమెంటు ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ (సిసిజిఇడబ్ల్యు), ఆల్‌ ఇండియా స్టేట్‌ గవర్నమెంటు ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (ఎఐఎస్‌ జిఇఎఫ్‌), స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టిఎఫ్‌ఐ), ఆల్‌ ఇండియా స్టేట్‌ గవర్నమెంటు పెన్షనర్స్‌ ఫెడరేషన్‌ (ఎఐఎస్‌ జిపిఎఫ్‌), నేషనల్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ పెన్షనర్ల అసోసియేషన్‌ (ఎన్‌సిసిపిఎ) సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన ర్యాలీలో దేశ నలుమూలల నుంచి వేలాదిమంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు పాల్గొన్నారు. 'ఎన్‌పిఎస్‌ రద్దు చేయాలి, ఒపిఎస్‌ పునరుద్ధరించాలి, ఎన్‌ఇపిని వెనక్కి తీసుకోవాలి' అని డిమాండ్‌ చేస్తూ ఇంగ్లీష్‌, హిందీ భాషలతోపాటు ప్రాంతీయ భాషల్లో డిమాండ్లతో కూడిన ప్లకార్డులు, బ్యానర్లు చేబూని దేశ మిగతా 5లో రాజధాని ఢిల్లీలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు కదంతొక్కారు. మోడీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
            అనంతరం ఉద్యోగ సంఘం నేత సుభాష్‌ లాంబ, ఉపాధ్యాయ సంఘం నేత సిఎన్‌ భార్తి అధ్యక్షతన జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను తీవ్రంగా ఎండగట్టారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, పెన్షన్‌ ప్రైవేటీకరణకు మూలకారణమైన మోడీ ప్రభుత్వాన్ని ఓడించటమే తక్షణ కర్తవ్యమని అన్నారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఎ.శ్రీకుమార్‌ మాట్లాడుతూ.. పిఎఫ్‌ఆర్‌డిఎను రద్దు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను మానుకోవాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలని, వారిని రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టిఎఫ్‌ఐ) అధ్యక్షులు కెఎస్‌ హరికృష్ణ మాట్లాడుతూ.. విద్యలో కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణకు దోహదపడుతున్న జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణమైన లౌకిక, ప్రజాస్వామిక విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల నేతలు ఎస్‌బి యాదవ్‌, రూపక్‌ సర్కార్‌, సిఎన్‌ భారతి, అశోక్‌ తులే, కె రాఘవేంద్రన్‌ మాట్లాడారు.
 

                                                               తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎస్‌టిఎఫ్‌ఐ అనుబంధ సంఘం యుటిఎఫ్‌ ఆధ్వర్యాన వేలాది మంది ఉపాధ్యాయులు చలో ఢిల్లీలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి అరుణ కుమారి, నాగమణి, ఏలూరు జిల్లా అధ్యక్షులు పివి నరసింహారావు పాల్గొన్నారు.