Sep 27,2023 13:05

బెంగళూరు :   దేశీయ అతిపెద్ద ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ సుమారు 3,500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. వివిధ విభాగాల విలీనంతో పాటు ప్రాంతీయంగా సంస్థను మెరుగుపరచడంలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొవిడ్‌ సమయంలో ఆన్‌లైన్‌ విద్యకు ప్రాధాన్యత పెరగడంతో .. అధిక శాతం మంది ఉద్యోగులను నియమించుకున్నామని, అయితే ప్రస్తుతం డిమాండ్‌ తగ్గడంతో .. అందుకు తగినట్లు మార్పులు చేపడుతోందని ఆ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా సుమారు 3,500 మంది వరకు తొలగించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. బైజూస్‌లో  ఇది చివరి తొలగింపులు అని, అక్టోబర్‌ చివరి నాటికి మొత్తం ప్రక్రియ ముగించవచ్చని తెలిపాయి.తొలగించబోయే ఉద్యోగుల్లో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు సైతం ఉంటారని తెలుస్తోంది.

బైజూస్‌ ఇండియాకు ఇటీవలే కొత్త సిఇఒగా అర్జున్‌ మోహన్‌ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.  ఉద్యోగుల వేతనాల కోసం వెచ్చిస్తున్న వ్యయాన్ని తగ్గించుకోవడంతో పాటు పలు  నిర్వహణ  విధానాలను తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. నిధుల ప్రవాహంలో ఆటంకాలు ఎదురవుతుండటంతో వీలైనంత త్వరగా పునర్‌ వ్యవస్థీకరణ ప్రణాళికలను అమలు చేసి వ్యయాలను నియంత్రించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.