న్యూఢిల్లీ : ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) నోటీసులు జారీ చేసింది. విదేశీ నిధుల చట్టాలు (ఫెమా) ఉల్లంఘించినందుకు రూ.9000 కోట్లు చెల్లించాల్సిందిగా ఆ సంస్థకు ఈడి నోటీసులిచ్చినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. అయితే ఈ వార్తలను బైజూస్ ఖండించింది. ఈడి నుండి తమకు ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు.
2011 నుండి 2023 మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) రూపంలో రూ.28 వేల కోట్లు బైజూస్ అందుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇదే కాలంలో విదేశీ పెట్టుబడుల రూపంలో ఇతర దేశాలకు రూ.9,754 కోట్లను బైజూస్ తరలించినట్లు పేర్కొన్నాయి. దీంతో ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద నోటీసులిచ్చినట్లు వెల్లడించాయి.
2015లో బైజూస్ లెర్నింగ్ యాప్‌ను ప్రారంభించారు. 2018 నాటికే 1.5 కోట్ల యూజర్లను సంపాదించుకుంది. కరోనా సమయంలో మరింత పాపులర్ అయ్యింది. అయితే ఆ తర్వాత భారీ నష్టాల్లో కూరుకుపోయింది.