గాజా, వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయిల్ దాడి ఫలితం
యుద్ధం కొనసాగితే పరిస్థితి మరింత తీవ్రమవుతుందన్న ఐఎల్‌ఓ
గాజా స్ట్రిప్ : పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ జరుపుతున్న అమానుష దాడుల కారణంగా గాజా స్ట్రిప్, వెస్ట్‌బ్యాంక్ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. లక్షలాది మంది ప్రజలు ఉద్యోగాలు, ఉపాధికి దూరమై అవస్థలు పడుతున్నారు. గాజా స్ట్రిప్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 61% మంది అంటే 1.82 లక్షల మంది జీవనోపాధి కోల్పోయి వీధిన పడ్డారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) తన నివేదికలో ఈ విషయాన్ని బయటపెట్టింది. హమాస్‌తో ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుండి గాజాలో మౌలిక సదుపాయాలు దారుణంగా దెబ్బతిన్నాయని, వ్యాపారాలు మూతపడ్డాయని, ప్రజలు పెద్ద ఎత్తున నిరాశ్రయులయ్యారని, ఆహారం, తాగునీరు, ఇంధనానికి కొరత ఏర్పడిందని ఆ నివేదిక తెలిపింది. మొత్తంగా అక్కడ ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయని వివరించింది. యుద్ధం ప్రభావం వెస్ట్‌బ్యాంక్‌పై కూడా పడింది. అక్కడ మొత్తం ఉద్యోగుల్లో 24% మంది అంటే 2.08 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణహోమం కారణంగా ఈ రెండు ప్రాంతాల్లో 3,90,000 మందికి ఉపాధి కరువైంది. మరో మాటలో చెప్పాలంటే దినసరి వేతన కార్మికులు రోజుకు 16 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోతున్నారు.
ఇజ్రాయిల్ తన దాడులను మరింత ఉధృతం చేస్తే ఉపాధి కోల్పోయే వారి సంఖ్య ఇంకా పెరుగుతుందని, మానవతావాద సంక్షోభం తీవ్రతరమవుతుందని ఐఎల్‌ఓ హెచ్చరించింది. గాజాలో నెలకొన్న పరిస్థితి కారణంగా కార్మిక మార్కెట్, ఉద్యోగావకాశాలు, ప్రజల జీవన స్థితిగతుల పైన తీవ్రమైన ప్రభావం పడింది. 'మా ప్రాథమిక అంచనాలను పరిశీలిస్తే ఆందోళనకరమైన, బాధాకరమైన ఫలితాలు వస్తున్నాయి. ఘర్షణ కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది' అని అరబ్ దేశాలకు సంబంధించిన ఐఎల్‌ఓ ప్రాంతీయ డైరెక్టర్ రూబా జరాదత్ చెప్పారు. ఈ సంక్షోభం ప్రాణనష్టానికి, కనీస మానవ అవసరాలకు మాత్రమే పరిమితం కాలేదని, సామాజిక, ఆర్థిక సంక్షోభానికి కూడా దారి తీస్తోందని ఆమె తెలిపారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కోల్పోయిన వారు కోలుకోవడానికి చాలా కాలం పడుతుందని అన్నారు. గాజాకు మానవతావాద సాయాన్ని పూర్తి స్థాయిలో, ఎలాంటి అవరోధాలు లేకుండా తక్షణమే అందించాల్సిన అవసరం ఉన్నదని ఐఎల్‌ఓ పాలక మండలి పిలుపునిచ్చిందని ఆమె చెప్పారు. బాధిత ఉద్యోగులు, వ్యాపారులకు వెంటనే సాయం అందించేందుకు ప్రభుత్వంతో, యాజమాన్యాలతో, ఇతర ఐరాస సంస్థలతో కలిసి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని రూబా జరాదత్ తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు ఐఎల్‌ఓ మూడు దశలుగా కార్యక్రమాలు చేపడుతోంది. మొదటి దశలో భాగంగా తక్షణ సాయంతో సహాయక చర్యలు ప్రారంభించింది. అత్యవసర సహాయం అందజేయడానికి వీలుగా 1.1 మిలియన్ డాలర్లను సేకరించింది. జరిగిన నష్టంపై సమాచారాన్ని సేకరించి, ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తోంది.