- త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా వెల్లడి
ముంబయి : ప్రముఖ ఆహార డోల్ డెలివరీ సంస్థ జమాటో భారత్‌లో తన కార్యాకలాపాలను భారీగా కుదించుకుంటోంది. ఇప్పటికే సిబ్బందిని తగ్గించుకున్న ఆ సంస్థ ఇప్పుడు సేవలను కుదిస్తోంది. దేశవ్యాప్తంగా 225 చిను నగరాల్లో తమ సేవలను నిలిపివేశామని జోమాటో ప్రకటించింది. మూడో త్రైమాసిక ఫలితాల నివేదికలో ఈ విషయాన్ని జమాటో పేర్కొంది. గ్రాస్ ఆర్డర్ విలువ 0.3 శాతం మాత్రమే ఉండటంతో ఆయా నగరాల్లో సేవలు నిలిపేస్తున్నట్లు పేర్కొంది. కాగా సేవలు నిలిపేసిన నగరాలు ఏమిటనేది పేర్లు వెల్లడించలేదు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.346.6 కోట్ల నష్టాలను నమోదు చేసింది. దీంతో ఇక నుంచి మెట్రో నగరాల్లోనే ప్రధానంగా దృష్టి సారించి కార్యాకలాపాలు సాగించాలని ఆ సంస్థ భావిస్తోంది. టెక్ సంస్థల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి తమ సంస్థలో ఉద్యోగాలిస్తామని గత నెలలో జమాటో సిఇఒ దీపిందర్ గోయల్ గొప్పగా ప్రకటించారు. వివిధ విభాగాల్లో దాదాపు 800 మందికి అవకాశాలిస్తామని తెలిపారు. అయితే ఇదే జమాటో గతేడాది చివరి రెండు నెలల్లో పనితీరు ఆధారంగా సంస్థలో మూడు శాతం సిబ్బందిని తొలగించింది. ఈ నేపథ్యంలో కంపెనీ 225 నగరాల్లో సేవలు నిలిపివేయడం వల్ల మరికొందరి ఉద్యోగాలు ఊడటం ఖాయంగా కనిపిస్తోంది.










