
గత మూడేళ్ళలో గ్రామ పంచాయితీలకు 14, 15వ ఆర్థిక సంఘాలు ఇచ్చిన రూ.7659 కోట్ల నిధులను పంచాయితీల ఖాతా నుండి ప్రభుత్వం దారి మళ్లించింది. ఏకపక్షంగా రూ.1350 కోట్లను నేరుగా విద్యుత్ చార్జీల బకాయిల పేర డిస్కామ్ ఖాతాలకు కూడా బదిలీ చేసింది. వాస్తవంగా ఆర్థిక సంఘం నిధులతో రహదారులు, మురుగు నీటి కాలువలు, పారిశుధ్యం, మంచినీటి సరఫరా తదితర అభివృద్ధి పనులు చేపడతారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల ఈ పనులు గ్రామీణ ప్రాంతాల్లో నిలిచిపోయాయి.
రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ ప్రతిపాదిత ఖర్చులకు అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకోవటానికి అనేక అరాచక పద్ధతులకు పాల్పడుతున్నది. పట్టణ, గ్రామ, స్థానిక సంస్థల ఆదాయాలను తన ఖర్చులకు మళ్లిస్తూ వాటిని ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. స్ధానికి సంస్ధల్లో గత మూడేళ్ళ నుండి అభివృద్ధి పనులన్నీ నిర్వీర్యం అయ్యాయి. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవటంతో కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టటానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. చేసిన పనుల బిల్లుల కోసం కాంట్రాక్టర్లు కోర్టులకెక్కాల్సిన దుస్ధితి కల్పించారు. గత మూడేళ్ళ నుండి రాష్ట్రంలో అన్ని రకాల డిపార్ట్‌మెంట్ల అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు సుమారు రూ. లక్ష కోట్ల పైబడి ఉన్నట్లు సమాచారం.
గత మూడేళ్ళలో గ్రామ పంచాయితీలకు 14, 15వ ఆర్థిక సంఘాలు ఇచ్చిన రూ.7659 కోట్ల నిధులను పంచాయితీల ఖాతా నుండి ప్రభుత్వం దారి మళ్లించింది. ఏకపక్షంగా రూ.1350 కోట్లను నేరుగా విద్యుత్ చార్జీల బకాయిల పేర డిస్కామ్ ఖాతాలకు కూడా బదిలీ చేసింది. వాస్తవంగా ఆర్థిక సంఘం నిధులతో రహదారులు, మురుగు నీటి కాలువలు, పారిశుధ్యం, మంచినీటి సరఫరా తదితర అభివృద్ధి పనులు చేపడతారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల ఈ పనులు గ్రామీణ ప్రాంతాల్లో నిలిచిపోయాయి. ప్రారంభించినవి కూడా అర్ధంతరంగా అగిపోయాయి. అలాగే యూనివర్సిటీలకు వివిధ రూపాల్లో వచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించు కుంటున్నది.
రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, అమరావతి స్మార్ట్ సిటీల కింద ఉన్నాయి. మ్యాచింగ్ గ్రాంట్ల కింద వీటికి వచ్చే కేంద్ర నిధులను కూడా సకాలంలో బదిలీ చేయడంలేదు. ఈ ప్రాజెక్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 50 శాతం నిధులనైనా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నది. స్మార్ట్ సిటీ కాల పరిమిత అయిదేళ్లు ముగిసినా ఆమోదించబడ్డ చాలా అభివృద్ధి పనులు ప్రారంభానికే నోచుకోలేదు. అమృత పథకం, స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ భారత్‌లతో పాటు పేదల గృహ నిర్మాణాలకు కేంద్రం నుండి వచ్చే నిధులును కూడా రాష్ట్ర ప్రభుత్వం తన తక్షణ అవసరాలకు వినియోగించుకుంటున్నది. దాంతో రాష్ట్రంలో గృహ నిర్మాణాలు పెద్దఎత్తున నిలిచి పోయాయి.
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు రాజ్యాంగ బద్దంగా బదిలీ చేయాల్సినా నిధులు, గ్రాంట్లు, ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని దెబ్బ తీస్తున్నది. ప్రతి ఐదేళ్ళకొకసారి రాజ్యాంగం లోని 243 (వై) అధికరణం ప్రకారం స్థానిక సంస్థలకు నిధుల బదిలీ కోసం ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు 6వ రాష్ట్ర ఆర్థిక సంఘం అమలులో వుండాలి. కాని 2015-20 కాలానికి 4వ ఆర్థిక సంఘం నియమించారు. ఈ సంఘం 2019లో నివేదికను ఇచ్చింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేయడం గాని, అసెంబ్లీలో పెట్టి ఆమోదించి అమలు చేయడం గానీ జరగలేదు. ఈ సంఘం ఇచ్చిన సిఫార్సులు అమలు కాకముందే దీని కాలపరిమితి ముగిసిపోయింది. 2020-25 కాలపరిమితికి 5వ ఆర్థిక సంఘాన్ని నియమించాలి. కాని ఇప్పటి వరకు ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాన్ని ప్రతి ఐదేళ్ళకొకసారి క్రమం తప్పకుండా నియమించటం లేదు. ఒకవేళ నియమించినా ఆర్థిక సంఘం సిఫార్సులు ఆమోదించి అమలు చేయడం లేదు. ఫలితంగా గత ఏడేళ్ళ నుండి రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు రావడం లేదు. అంతేగాక 010 పద్దు కింద శాశ్వత ఉద్యోగులకు జీతాలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నదనే కారణం చూపి...తలసరి గ్రాంట్లను గత కొన్నేళ్ల నుండి కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు నిలిపివేసింది. దీంతోపాటు స్టాంప్ డ్యూటీలో వచ్చే నష్టపరిహారాన్ని కూడా కార్పొరేషన్‌లకు ప్రభుత్వం ఇవ్వడం లేదు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎస్‌సి, ఎస్‌టీ లకు సబ్‌ప్లాన్ కింద స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేసింది. కొన్ని పనులు పూర్తయ్యాయి. మరికొన్ని పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. కాని నిధులు నేటికీ ఇవ్వకపోగా ఆ బిల్లులు విశాఖపట్నం, విజయవాడ వంటి మున్సిపల్ కార్పొరేషన్‌లే భరించాలని జీవోలు ఇచ్చారు. అలాగే ప్రత్యేక అభివృద్ధి పనుల కింద రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు, పంచాయితీలకు గ్రాంట్లు ఇస్తామని ప్రకటించినవి కూడా ఇవ్వటం లేదు. ఆ బిల్లుల భారం కూడా స్థానిక సంస్థల మీదే పడుతున్నది. ఇక ఎంపిలు, ఎంఎల్‌ఏలు తమకు ప్రభుత్వం నుండి నిధులు వస్తాయని నగర పాలక సంస్థల మీద ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కాని ఆ పనులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు రావడం లేదు. ఈ భారం కూడా పట్టణ స్థానిక సంస్థల మీదే పడుతున్నది.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోతూ రాష్ట్రంలో సిఎఫ్‌ఎంఎస్ (సమగ్ర ద్రవ్య మేనేజ్‌మెంట్ సిస్టమ్) అమలులోకి తీసుకొచ్చారు. ఇప్పుడది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద వరప్రసాదంగాను, స్ధానిక సంస్ధలకు పెద్ద గుదిబండగా మారింది. ఎందుకంటే సిఎఫ్‌ఎంఎస్ ప్రవేశపెట్టిన తరువాత పట్టణ, గ్రామ, స్ధానిక సంస్థలకు తమ పరిధిలో తమకి వచ్చే పన్నులు, పన్నేతర ఆదాయం నేరుగా సిఎఫ్‌ఎంఎస్‌లకు వెళుతున్నది. ఇలా జమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన తక్షణ అవసరాలకు దారి మళ్లిస్తున్నది. స్థానిక సంస్థలు తమ సొమ్మును తిరిగి చెల్లించమని ప్రాధేయపడాల్సి వస్తున్నది. దీంతో పట్టణ, గ్రామ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కునారిల్లిపోతున్నది.
73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన గ్రామ పంచాయితీలకు 29, పట్టణ సంస్థలకు 18 అధికారాలను ప్రస్తుత వైసిపి ప్రభుత్వం కూడా పూర్తిగా బదిలీ చేయలేదు. బదిలీ చేసిన వాటిని కూడా పూర్తిగా వినియోగించుకునే స్వేచ్ఛ లేకుండా చేశారు. అన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కనుసన్నల్లో, వాటి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని నియంత్రిస్తు న్నాయి. ఎన్నికైన కౌన్సిళ్లకు ఎలాంటి హక్కులు లేకుండా చేస్తున్నారు. చివరికి వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన పన్నులు, యూజర్ చార్జీలు, ఫీజులు ప్రజలపై విధించి వసూలు చేసేవిగా మార్చేశారు.
కేంద్ర బిజేపి ప్రభుత్వం కూడా మొదటి నుండి స్థానిక సంస్థలను ఆర్థికంగా, అభివృద్ధి పరంగా నిర్వీర్యం చేస్తున్నది. ప్రమాదకర చర్యలకు తెరలేపింది. పట్టణ రంగం అనేది రాష్ట్ర పరిధి లోని అంశం. అయినా రాష్ట్రాలను లొంగ దీసుకొని పట్టణ ప్రజలపై తీవ్రమైన పన్ను భారాలకు వడిగట్టింది. అంతేగాక కేంద్రం ప్రవేశ పెట్టిన స్మార్ట్ సిటీ, అమృత, స్వచ్ఛభారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ వంటి పథకాలన్నిటినీ చాలా తక్కువ పట్టణాలకు మాత్రమే పరిమితం చేసింది.
స్మార్ట్ సిటీ పథకం అయితే కేవలం వంద నగరాలకు పరిమితమైనది. అదీ మొత్తం 100 నగరాల్లో కేవలం ఐదు శాతం ప్రజలు నివశించే ప్రాంతంలో మాత్రమే ఈ పథకం అమలుచేశారు. ఈ నిధులన్నిటినీ ఆ ప్రాంతంలోనే ఖర్చు చేశారు. అలాగే ఒకే నగరంలో స్మార్ట్‌సిటీ భాగాన్ని విడదీసి లిమిటెడ్ సంస్థలుగా కంపెనీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పివి) కింద ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి ఎన్నికైన కౌన్సిళ్లకు స్మార్ట్‌సిటీపై ఎలాంటి అధికారం లేకుండా చేస్తున్నారు. విడుదలయ్యే నిధులకు ప్రత్యేక ఖాతాలు తెరిచి ఎస్‌పివికి బదలాయిస్తున్నారు. ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు సరిపడ నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వక పోవటం వల్ల విశాఖపట్నం వంటి నగరాలు అప్పుల ఉబిలో కూరుకుపోయాయి.
కేంద్ర ఆర్థిక సంఘం నుండి వచ్చే నిధులను పన్ను భారాలు, పౌర సేవల ప్రైవేటీకరణ, వ్యాపారీకరణతో ముడి పెట్టి ఇస్తున్నది. అలాగే కేంద్ర ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలు తమ ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవటానికి వీలు లేకుండా చేస్తున్నది. కేంద్రం ఆదేశించిన పనులకే వినియోగించాలని షరతులు పెడుతున్నది. ఈ నిధులు ప్రజల అత్యవసర పనులకు ఉపయోగపడటం లేదు. ఈ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్ధానిక సంస్థల అభివృద్ధిని నిర్వీర్యం చేస్తూ...ప్రజలపై అనేక రకాలుగా పన్ను భారాలు వేస్తూ...పౌర సేవలను ప్రైవేటీకరిస్తున్నాయి.
డా. బి. గంగారావు / వ్యాసకర్త సెల్ : 9490098792 /