Nov 21,2023 11:08

 కృష్ణాజలాల హక్కులను కాపాడటంలో విఫలం
 30 గంటల దీక్షలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ


ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తీవ్రమైన వర్షాభావంతో కరువు తాండవిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా కరువు తీవ్రతలేదని అబద్దాలను చెబుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో కరువు, కృష్ణా జలాల పున:పంపిణీ అంశాల్లో రాష్ట్రప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం విజయవాడలో సిపిఐ ఆధ్వర్యాన 30 గంటల దీక్ష ప్రారంభమైంది. ఈ సందర్బంగా వివిధ జిల్లాల నుండి తెచ్చిన ఎండిపోయిన పంటలను దీక్షా శిభిరంలో ప్రదర్శించారు. ఈ దీక్షలను ఉద్దేశించి కె రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్రంలో కరువు మండలాలు 400 ఉంటే ఆ తీవ్రతను రాష్ట్రప్రభుత్వం తగ్గించి చెబుతోందన్నారు. ముఖ్యమంత్రే కాదు మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ మాట్లాడక పోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ఇటీవల కేబినెట్‌లో కరువుపై చర్చించకపోవడం దుర్మార్గమని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కర్ణాటక ఎన్నికలకు ముందు తుంగభద్ర ఆయకట్టు దెబ్బతినేలా అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు నిదులను ఇచ్చారని, ఇప్పుడు తెలంగాణాలో రాజకీయ లబ్దికోసం కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పును అపహాస్యం చేసేలా కృష్ణాజలాల పున:పంపిణీకి గెజిట్‌ను విడుదల చేశారని అన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రయోజనాలు దెబ్బతింటున్నా సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడక పోవడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, ఆలిండియా కిసాన్‌ సభ అద్యక్షులు రావుల వెంకయ్య, సిపిఐ రాష్ట్ర నాయకులు జెల్లి విల్సన్‌, ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, కాంగ్రెస్‌ నాయకులు సుంకర పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.