Nov 21,2023 11:00

పంటనష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకోవాలి : సిపిఎం డిమాండ్‌


ప్రజాశక్తి- యంత్రాంగం : ఖరీఫ్‌లో పంట నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం చేసింది. శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలో ఎండిపోయిన వరి పంటలను సిపిఎం నాయకులు పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకోవాలని అనంతపురం జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టారు. అనంతపురం రూరల్‌ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నానుద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. రాంభూపాల్‌ మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో వర్షాలు రాకపోవడంతో వేరుశనగ, కంది, పత్తి, ఆముదం, జొన్న, మొక్కజొన్న తదితర 16 రకాల పంటలు పూర్తిగా నష్టపోయినట్లు చెప్పారు. వేరుశనగ, పత్తి పంటల సాగుకు ఎకరాకు రూ. 45 వేలు ఖర్చు అవుతుండగా, ఎకరాకు కేవలం రూ.6,800లు మాత్రమే పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమన్నారు. జిల్లాలో పంటనష్టపోయిన ప్రతి ఎకరాకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా కనీసం రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, సాగులో ఉన్న కౌలు రైతులకు పరిహారం చెల్లించాలని, బ్యాంకు అప్పులు మాఫి చేసి, వలసలు నివారించేందుకు ఉపాధి హామీ పనులు 200 రోజులు కల్పించాలని, రోజు కూలీ రూ.600లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
ఎండిపోయిన పంటలను పరిశీలించిన నాయకులు
శ్రీకాకుళం జిల్లా నందిగాం, పలాస మండలాల్లోని వెంకన్నపేట, బోరుభద్ర, ఆనందపురం, మాదిగాపురం, కామధేనువు, లింగపురం, సవరలింగుపురం, సవరపడదాం తదితర గ్రామాల్లో ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించారు. రణస్థలం మండలంలోని కొండములగాం, కమ్మసిగడాం, వేల్పురాయి, బంటుపల్లి, కంబాలపేటలో వర్షాభావంతో నష్టపోయిన వరి పంటలను సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, కౌలురైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు తదితరులు పంటలను పరిశీలించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక పంచాయతీ శివారు మనబాలవానిపాలెంలో ఎండిన వరి పొలాలను సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాధం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కరువు కాటకాలతో రైతులు, కూలీలు అల్లాడుతుంటే ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టకపోవడం అన్యాయమన్నారు. అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.