Nov 21,2023 11:04

11న చలో విజయవాడ, 20న సమ్మె
సమగ్ర శిక్షా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌


ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాల విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ప్రాజెక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఎపి సమగ్ర శిక్షా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌ చేసింది. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆ ఫెడరేషన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం బాలకాశి, బి కాంతారావు, ఉపాధ్యక్షులు కె విజరు సోమవారం విలేకరులతో మాట్లాడారు. సమావేశం అనంతరం నాయకులతో కలిసి సర్వ శిక్ష అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి శ్రీనివాసరావును కలిసి సమ్మె నోటీసును అందించారు. అంతకుముందు విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారంలో రాష్ట్రప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పిఆర్‌సి అమలు చేయకుండా నెలలు తరబడి వేతనాలు విడుదల చేయకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిమం టైం స్కేల్‌పై జీవోలు మీద జీవోలు ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. ఉద్యోగుల మధ్య విభేదాలు, విభజన సృష్టించే విధానాలు అమలు చేస్తోందని మండిపడ్డారు. ప్రాజెక్టులో ఉద్యోగుల వేతనాల్లో రకరకాల వేతనాలు చెల్లిస్తూ కొత్త విధానాలకు తెరలేపారని చెప్పారు. పార్ట్‌టైం పేరుతో తక్కువ జీతాలు ఇచ్చే విధానాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కొన్ని విభాగాలకు, కెజిబివి టీచర్లకు అరకొర జీతాలు పెంచి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్న హామీని ఎందుకు అమలు చేయలేకపోయారో చెప్పాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదారులు, అధికారులకు నాలుగున్నరేళ్లుగా వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి 25వేల మంది ఉద్యోగుల కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జిల్లా, రాష్ట్ర కమిటీలు, అన్ని సంఘాలు, ఉద్యోగులతో కలిసి డిసెంబర్‌ 20 నుంచి సమ్మెకు వెళ్తున్నామని హెచ్చరించారు. ఈ నెల 22 నుంచి 25లోపు అన్ని జిల్లాల అధికారులు, మండల అధికారులకు నోటీసులు ఇస్తామన్నారు. 25 నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇస్తామన్నారు. 27, 28 తేదిల్లో మండల కేంద్ర, స్కూళ్ల వద్ద భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పారు. డిసెంబర్‌ 3న జిల్లా కేంద్రాల్లో ఆవేదన దీక్ష ఉంటుందని తెలిపారు. డిసెంబర్‌ 11న చలో విజయవాడ కార్యక్రమం ఉంటుందని హెచ్చ రించారు. ఈ సమావేశంలో వైస్‌ చైర్మన్‌ సిహెచ్‌ దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.