Nov 22,2023 10:54

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనరు తుమ్మా విజయ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తూ అక్రిడిటేషన్‌ కలిగి అర్హులైన జర్నలిస్టులకు హౌసింగ్‌ స్కీమ్‌ కింద ఇంటి స్థలాలను అందించేందుకు ప్రభుత్వం జిఓ నెంబరు 535 ద్వారా వీలు కల్పించిందన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన జర్నలిస్టులు ఇళ్ల స్థలాల మంజూరు కోసం తమ వివరాలను http://ipr.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. నవంబరు 23 నుంచి వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంటుందని, 45 రోజుల్లోగా (2024 జనవరి 6వ తేదీ) జర్నలిస్టులు సంబంధిత వివరాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలన్నారు. అక్రిడిటేటెడ్‌ జర్నలిస్టులకు కేటాయిస్తున్న ఇళ్లస్థలం విలువలో 60 శాతం ప్రభుత్వం, 40 శాతం జర్నలిస్టులు చెల్లించాలని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత జర్నలిస్టు అక్రిడిటేషన్‌ వివరాలను, జర్నలిస్టుగా వారి వృత్తి అనుభవాన్ని ప్రాథమికంగా పరిశీలించి అర్హులైన జర్నలిస్టుల జాబితాలను రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనరు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరుకు అందజేస్తామని తెలిపారు. అనంతరం జిల్లా కమిటీలు నిబంధనల మేరకు జర్నలిస్టుల అర్హతను పరిశీలించి ఇళ్ల స్థలాలను కేటాయించడానికి సరైన స్థలాలను జిల్లా పరిధిలోనే గుర్తిస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే తాము సరైన స్థలాలను గుర్తించే విధంగా జిల్లా స్థాయి కమిటీలను వారం రోజుల్లోగా ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు లేఖలు రాశామన్నారు.