- జాబ్ మేళాలో అరకొర రిజిస్ట్రేషన్లు
- హాజరైన వారిలో కొద్దిమందికే ఆఫర్ లెటర్లు
- నినాదంగానే మారిన స్థానిక యువతకు ఉద్యోగాలు
ప్రజాశక్తి-అమరామతి బ్యూరో : యువతలో ఆశలు రేపుతున్న జాబ్‌మేళా ఆర్భాటాలతో ప్రారంభమై చివరికి ఊసూరుమనిపిస్తోంది. ఉత్సాహంగా అక్కడకు వెళ్లినవారు నిరుత్సాహంగా బయటకు వస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించే జాబ్‌మేళాలో వేలకొలది ఉద్యోగాలతో కంపెనీలు వస్తున్నాయని ఊదరగొడుతున్నా.. 10 శాతం కూడా ప్రైవేటు కంపెనీలు స్థానిక యువతను ఉద్యోగంలోకి తీసుకోవడం లేదు. కొద్దిమందికి ఆఫర్ లెటర్లిచ్చి చేతులు దులుపుకుంటున్నాయనే విమర్శలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, సాధారణ డిగ్రీల్లో సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులైతే అందులో 30 శాతం విద్యార్థులు ఉపాధి కల్పనా కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవడం లేదు. డిప్లమో, ఐటిఐ, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు రిజిస్ట్రేషన్లు చేసుకుంటే రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతుంది. నిరుద్యోగుల సంఖ్య తగ్గించి చూపేందుకు ఆఫ్‌లైన్‌లో నమోదైన వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. మేళాల్లో లభిస్తున్న వేతనాలు నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు మాత్రమే ఉండటంతో చాలా మంది స్కిల్ ఉన్న యువత ఉద్యోగం మానేసి, ఇతర ఉద్యోగాలు వెతుక్కుంటూ పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఇప్పటి వరకు 13,250 మంది నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకోగా.. వీరిలో ఐదువేల మంది మాత్రమే జాబ్‌మేళాకు హాజరయ్యారు. వీరిలో 30 శాతం మందికి ఉద్యోగాలు వచ్చినట్లుగా నిర్వాహకులు ప్రకటించారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు మూడువేల మంది జాబ్‌మేళాల్లో పేర్లు నమెదు చేసుకోగా, ఇందులో 350 మందికి మాత్రమే ఉద్యోగాలిచ్చామని ప్రకటించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 28 వేల మందికి పైగా నిరుద్యోగులు జాబ్‌మేళాలో పేర్లు నమోదు చేసుకోగా, అందులో 1,200 మందికి మాత్రమే ఆఫర్ లెటర్లిచ్చారు. చిత్తూరు జిల్లాలో 34 వేల మంది నిరుద్యోగులు నమోదు చేసుకోగా, అసలు జాబ్‌మేళాను సక్రమంగా నిర్వహించిన దాఖలాల్లేవు. వైఎస్‌ఆర్ కడప జిల్లాలో 2020లో నిర్వహించిన జాబ్‌మేళాలో తొమ్మిది వేలమంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకోగా, మూడువేల మందికి మాత్రమే ఆఫర్ లెటర్లు చేతిలో పెట్టారు. ప్రకాశం జిల్లాలో 59 వేల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్లు చేసుకోగా, అందులో 28 వేల మంది మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. గతంలో ఏటా 12 వేల మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకోగా, ఇప్పుడు ఈ సంఖ్య 1,500కు పడిపోయింది. ఇలా అన్ని జిల్లాల్లోనూ నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తూనే ఉంది. స్థానిక యువతకు స్థానిక ఉద్యోగాలు అనే ప్రభుత్వ నినాదం కేవలం నినాదంగానే మిగిలిపోయింది.