దేశంలో ప్రతి యేటా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2019లో దేశవ్యాప్తంగా 1,39,123 మంది ఆత్మహత్యలు చేసుకోగా, వీటిలో 14,019 మంది నిరుద్యోగులే. 2018లో 1,34,516 మంది ఆత్మహత్య చేసుకోగా, వీరిలో 12,936 (9.6 శాతం) నిరుద్యోగులు. 2017లో 1,29,788 మంది ఆత్మహత్య చేసుకోగా, అందులో 12,241 (9.4 శాతం) మంది నిరుద్యోగులు. 2016లో 1,31,008 మంది ఆత్మహత్యలు రికార్డ్ కాగా, అందులో 11,173 మంది (8.5 శాతం) నిరుద్యోగులు. 2015లో ఆత్మహత్య చేసుకున్న వారిలో నిరుద్యోగుల శాతం 8.2 కాగా, 2014లో 7.5 శాతముంది. కాగా, 2021లో రైతుల ఆత్మహత్యల సంఖ్య 10,881 ఉంటే...ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 13,089 ఉందని పార్లమెంట్ స్థాయి సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి రాజకీయ పార్టీలు సరైన పరిష్కార మార్గాలు చూపలేకపోతు న్నాయి. ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి..ఆ తర్వాత పట్టించుకోవడం మానేస్తున్నాయి. పోటీ పరీక్షల్లో విఫలమైన వారికి ప్రభుత్వాలు ప్రత్యేక కౌన్సెలింగ్ సెంటర్లు అందుబాటులో ఉంచితే మంచిది. ప్రభుత్వాలు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. ప్రయివేటు రంగంలో నూ కనీస వేతనాలు అమలయ్యేలా చూడాలి.
- ఫిరోజ్ , సెల్ : 9640466464