Nov 04,2023 10:27
  • అక్టోబర్‌లో రెండేళ్ల గరిష్ట స్థాయికి
  • 10.05 శాతానికి చేరిక : సిఎంఐఇ

న్యూఢిల్లీ : మోడీ పాలనలో దేశ యువత ఉద్యోగాలు లేక విలవిలలాడుతున్నది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని యువతకు హామీ ఇచ్చిన బిజెపి సర్కారు వారిని వంచిస్తున్నది. ఇందుకు పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలే నిదర్శనం. ఇప్పుడు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సిఎంఐఇ) సమాచారం సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నది. దీని ప్రకారం.. భారతదేశ నిరుద్యోగిత రేటు సెప్టెంబరులో 7.09 శాతం నుంచి అక్టోబర్‌లో 10.05 శాతానికి పెరిగింది. ఇది మే 2021 నుంచి అత్యధికం. అంటే రెండేళ్ల గరిష్ట స్థాయి అన్నమాట.
          అక్టోబర్‌లో గ్రామీణ నిరుద్యోగం 6.2 శాతం నుంచి 10.82 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 8.44 శాతంగా నమోదైంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఎకానమీని ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్‌ దీనిని నివేదించింది. ఇటు వ్యవసాయం రంగంలోనూ భారత్‌ తిరోగమన పరిస్థితిని ఎదుర్కొన్నది. భారత్‌లో ఐదేళ్లలో అత్యంత బలహీనమైన రుతుపవనాలను నమోదు చేయడంతో వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడిన గ్రామీణ ఉపాధి దెబ్బతిన్నది. 2022-23లో నిరుద్యోగ రేటు 3.2 శాతంగా ఉన్నదని గత నెలలో కేంద్రం తెలిపింది. జనవరిలో, ప్రభుత్వ వార్షిక ఆర్థిక సర్వే 2023-'24లో దేశ స్థూల దేశీయోత్పత్తి ఆరు శాతం నుంచి 6.8 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేసింది.
         కేంద్రంలోని మోడీ సర్కారు చెప్తున్న ఆర్థిక వ్యవస్థ గణాంకాలన్నీ మేడిపండు చందమేనని ఆర్థిక విశ్లేషకులు, నిపుణులు అంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పెరిగిందని చూపుతున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో ఉద్యోగ, ఉపాధి కల్పన దేశంలో జరగటం లేదని వారు చెప్తున్నారు. కేంద్రం అనుసరిస్తున్న అస్తవ్యవస్థ ఆర్థిక విధానాలే ఇందుకు కారణమవుతున్నాయని వారు అంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ యువత తీవ్రంగా నష్టపోయే ప్రమాదమున్నదని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. వచ్చే ఏడాది దేశంలో షెడ్యూల్‌ ప్రకారం జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ బిజెపికి దేశ యువత నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుందని, అది ఆ పార్టీకి రాజకీయంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని విశ్లేషకులు, నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.