Oct 26,2023 07:43
  • పొరుగు దేశాల కంటే ఇక్కడే అధికం
  •  ప్రపంచబ్యాంక్‌ నివేదిక

న్యూఢిల్లీ : ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోడీ.. నిరుద్యోగ యువతతో చెడుగుడు ఆడుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా.. ఆ ఖాళీలను అలాగే ఉన్నాయంటూ పార్లమెంట్‌లో కేంద్రం చెప్పుకుంటోంది. నియామకాల వైపు దృష్టిపెట్టడంలేదు. పకోడీలు వేసుకోమనో, మరోకటో అనేసి నిరుత్సాహపరుస్తోంది. మరోవైపు పొరుగు దేశాలతో పోలిస్తే గత సంవత్సరంలో మన దేశంలోనే నిరుద్యోగ రేటు అధికంగా ఉన్నదని ప్రపంచబ్యాంక్‌ తెలిపింది. నిరుద్యోగ రేటు మన పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో 11.3 శాతం, బంగ్లాదేశ్‌లో 12.9 శాతం, భూటాన్‌లో 14.4 శాతం ఉండగా మన దేశంలో 23.22 శాతంగా ఉంది. ప్రపంచబ్యాంక్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం చైనాలో 13.2 శాతం, సిరియాలో 22.1 శాతం, ఇండొనేషియాలో 13 శాతం, మలేసియాలో 11.7 శాతం, వియత్నాంలో 7.4 శాతం, దక్షిణ కొరియాలో 6.4 శాతం, సింగపూర్‌లో 6.1 శాతంగా నిరుద్యోగ రేటు నమోదైంది. అంతర్జాతీయ కార్మిక సంఘం విడుదల చేసిన సమాచారం ఆధారంగా ప్రపంచబ్యాంక్‌ ఈ వివరాలు వెల్లడించింది. చేసేందుకు పనిలేక, ఉద్యోగం కోసం వెతుకుతున్న 15-24 సంవత్సరాల మధ్య వయసున్న యువతను పరిగణనలోకి తీసుకొని యువతలో నిరుద్యోగ రేటును అంచనా వేస్తారు.
దేశంలో నిరుద్యోగమే అతి పెద్ద సమస్య అని 15-34 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో 36 శాతం మంది అభిప్రాయపడుతున్నారని లోక్‌నీతి-సిఎస్‌డిఎస్‌ సర్వే తెలిపింది.