Nov 13,2023 16:23

న్యూఢిల్లీ :   మోడీ ర్యాంక్‌ ద్రోహంతో దేశ యువత విసిగిపోయిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత ఆశయాలను, కలలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. దేశ యువతకు ద్రోహం చేసిందని సోమవారం ఎక్స్‌ (ట్విటర్‌)లో మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశ యువత ఉద్యోగం కోసం ఆకాంక్షిస్తోందని, కానీ దానికి ప్రతిఫలంగా 45 ఏళ్ల అత్యధిక నిరుద్యోగిత రేటు ఉందని పేర్కొన్నారు. వారు ఆర్థిక సాధికారతను కోరుకున్నారని, కానీ దానికి ప్రతిగా బిజెపి ధరల పెరుగుదలతో వెన్నుపోటు పొడిచిందని, వారి పొదుపులను 47 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గించిందని అన్నారు. యువత సామాజిక, ఆర్థిక న్యాయాన్ని కోరుకుంటోందని, కానీ మోడీ ప్రభుత్వం దేశంలో ఆర్థిక అసమానతలను పెంచుతోందని అన్నారు. ఐదు శాతం కార్పోరేట్లు దేశ సంపదలో 60 శాతం కలిగి ఉన్నారని, పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇంకా పేదరికంలోకి జారిపోతున్నారని అన్నారు. మహిళలు, చిన్నారులు, దళితులు, ఆదివాసీలు మరియు వెనుకబడిన తరగతులపై నేరాలు చాలా వేగంగా పెరిగాయని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని మరియు సామరస్యాన్ని యువత కోరుకున్నారని, కానీ కేంద్రం విద్వేషాన్ని, వర్గాల మధ్య విభజనను సృష్టిస్తోందని మండిపడ్డారు. గతవారం ప్రధాని మోడీ నిర్వహించిన ర్యాలీలో ఓ యువతి విద్యుత్‌ స్తంభం ఎక్కిన సంగతి తెలిసిందే. ఆ యువతి ప్రధానికి ఏదో విన్నవించాలనుకుందని ఖర్గే పేర్కొంటూ పై విధంగా స్పందించారు.