న్యూఢిల్లీ : ఉల్లి ధరల పెరుగుదలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్రంపై విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో బిజెపిని ఓడించిన అనంతరం ఐదు రాష్ట్రాల ప్రజలు ఉల్లి ధరలు మరోసారి ఎందుకు పెరిగాయనే రహస్యాన్ని వెల్లడిస్తారని అన్నారు. సరఫరా తగ్గడంతో ఢిల్లీలోని రిటైల్ మార్కెట్‌లో ఉల్లి ధరలు రూ.65 - 80కి పెరిగాయి. మరోసారి ఉల్లి ధరలు ఎందుకు భారంగా మారాయి. ఈ ప్రశ్నకు సమాధానంగా ప్రజలు వచ్చే ఎన్నికల్లో బిజెపికి మంచి గుణపాఠం చెబుతారని అన్నారు. గత తొమ్మిదిన్నరేళ్ల బిజెపి ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణ భారంతో ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రతిసారీ ద్రవ్యోల్బణం అంశంపై మోడీ ప్రభుత్వం జోకులు వేస్తోందని మండిపడ్డారు. '' ద్రవ్యోల్బణం కనిపించడం లేదు. నేను ఉల్లిపాయలు తినను. ఇతర దేశాల కంటే భారత్‌లో మెరుగ్గా ఉంది '' అని ప్రజలను హేళన చేస్తోందని దుయ్యబట్టారు.