న్యూఢిల్లీ : మణిపూర్‌లో హింసాకాండను నియంత్రించడానికి మొదటి చర్యగా బిజెపి 'అసమర్థ ముఖ్యమంత్రి' ఎన్. బీరేన్ సింగ్‌ను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. మణిపూర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఖర్గే బుధవారం ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. అక్కడి మహిళలు, చిన్నారులపై హింసను ఆయుధంగా మార్చుకుందని, ఫలితంగా అందమైన మణిపూర్ రణరంగంగా మారిందని, దీనికి కారణం బిజెపియేనని ధ్వజమెత్తారు. ''147 రోజులుగా మణిపూర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. ప్రధానికి ఆ రాష్ట్రానిన సందర్శించేందుకు సమయం లేదు. ఈ హింసలో దుండగులు విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న భయంకరమైన ఫొటోలు మరోసారి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి '' అని ఎక్స్ (ట్విటర్)లో తెలిపారు.
జులై ఆరున అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మణిపూర్ మరోసారి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. విద్యార్థుల హత్యను నిరసిస్తూ మంగళవారం విద్యార్థులు చేపట్టిన ఆందోళనపై పోలీసులు విరుచుకుపడ్డారు. రబ్బరు బుల్లెట్లు, టియర్‌గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీచార్చ్ చేయడంతో సుమారు 45 మంది గాయపడ్డారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.