Nov 22,2023 08:18

ఇంఫాల్‌ :   మే 3 నుండి లైంగిక వేధింపులు, ఇతర నేరాలకు గురైన బాధిత మహిళలకు పరిహారం కోసం బ్యాంకు ఖాతాలో రూ. ఐదు కోట్లు జమ చేసినట్లు మణిపూర్‌ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఓ అఫిడవిట్‌ను సోమవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. అయితే ఇప్పటివరకు ఎంతమంది మహిళలకు పరిహారం అందించామనే వివరాలను అఫిడవిట్‌లో పేర్కొనలేదు. ఈ ఏడాది మే 3న మొయితీ, కుకీ కమ్యూనీటీల మధ్య ఘర్షణలు రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. దీంతో ఆగ్రహించిన మొయితీ వర్గం కుకీలపై అమానుష దాడులు జరిపిన సంగతి తెలిసిందే.

మతపరమైన జిల్లాల గుర్తింపు కార్యక్రమం పూర్తయిందని నోనీ, సేనాపతి జిల్లాల డిప్యూటీ కమిషనర్లు తాజా నివేదికలో పేర్కొన్నట్లు అఫిడవిట్‌ తెలిపింది. ఈ రెండు జిల్లాల్లో ఇప్పటివరకు మతచిహ్నమైన భవనాలను ధ్వంసం చేసినట్లు, ధ్వంసమైనట్లు నివేదికలు లేవని పేర్కొంది.

రాష్ట్రంలో చర్చిలు, దేవాలయాలు, సనామాహి టెంపుల్స్‌, మసీదులు సహా మరేదైనా ఇతర మతానికి చెందిన భవనాలను గుర్తించాలని, ప్రస్తుతం ఉన్నా లేదా మే 3నుండి ప్రారంభమైన హింసాకాండలో కాలిపోయినా, దెబ్బతిన్నా, ఆక్రమణకు గురైనా రక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సెప్టెంబర్‌లో ఆదేశించింది. అత్యాచారం, లైంగిక వేధింపులు, ఇతర నేరాలకు గురైన మహిళలకు పరిహార పథకాన్ని ప్రకటిస్తామని మణిపూర్‌ ప్రభుత్వం తెలిపింది.

దుండగుల  దాడి..  ఇద్దరు మృతి
సోమవారం కాంగ్‌పోక్సీ జిల్లాలో సాయుధ దుండగుల దాడిలో  ఐండియన్‌ రిజర్వ్‌ బెటాలియన్‌ (ఐఆర్‌బి)కి చెందిన   అధికారి, డ్రైవర్‌ మరణించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఆ ప్రాంతంలో అనుమానితులను గుర్తించేందుకు అస్సాం రైఫిల్స్‌ను మోహరించినట్లు ఆ వర్గాలు ప్రకటించాయి. గిరిజన ఐక్యతా కమిటీ (సిఒటియు) నిరసనగా కాంగ్‌పోక్సీ జిల్లాలో అత్యవసర బంద్‌ను ప్రకటించింది.