ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. బిల్లులను ఉద్దేశపూర్వకంగానే గవర్నర్లు తొక్కిపడుతున్నారని తమిళనాడు, కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. పంజాబ్ పిటిషన్‌పై గత వారం విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం సోమవారం తమిళనాడు, కేరళ పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తమిళనాడు గవర్నరు తీరుపై సీరియస్ అయింది. 2020లో అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులను ఎటూ తేల్చకుండా మూడేళ్లుగా ఎందుకు తొక్కిపట్టారని నిలదీసింది. నవంబర్ 10న నోటీసు జారీ చేసిన తర్వాతే, పది బిల్లులను తమిళనాడు గవర్నరు ఈ నెల 13న వెనక్కి పంపడాన్ని ధర్మాసనం ప్రస్తావిస్తూ,, నవంబర్ 10న తాము ఘాటుగా మందలించిన తరువాతే గవర్నరు ఈ పని చేశారు. ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించేవరకు ఆయన ఎందుకు స్పందించరు?'' అని అటార్నీ జనరల్ (ఎజి) ఆర్. వెంకటరమణిని ఉద్దేశంచి సిజెఐ డివై చంద్రచూడ్ ప్రశ్నించారు.దీనికి ఎజి వెంకటరమణి స్పందిస్తూ... రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించి గవర్నర్ అధికారాల ఉపసంహరణ బిల్లులకు సంబంధించినవి మాత్రమే వివాదం అని, ఇది ఒక ముఖ్యమైన అంశం కాబట్టి, కొంత పునరాలోచన అవసరమని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో మూడేళ్ల క్రితం పంపినవి కూడా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. గవర్నర్ కార్యాలయానికి ఏ బిల్లు ఎప్పుడు వచ్చినదీ తేదీలతో సహా వివరాలు తమ దగ్గర ఉన్నాయని కోర్టు పేర్కొ ప్రస్తుత గవర్నర్ ఆర్‌ఎన్ రవి నవంబర్ 2021లో బాధ్యతలు స్వీకరించారని ఎజి అనగా, ఏదేమైనా గవర్నర్ ఆలస్యం చేశారా? లేదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. తమిళనాడు అసెంబ్లీ మళ్లీ బిల్లులను ఆమోదించి పంపింది. గవర్నర్ ఏం చేస్తారో చూద్దాం అంటూ తదుపరి విచారణను డిసెంబరు ఒకటో తేదీకి వాయిదా వేసింది. తమిళనాడు రాష్ట్రం తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ అభిషేక్ సింఘ్వీ కోర్టులో తమ వాదనలు వినిపించారు. గవర్నరు గత వారం వెనక్కి బిల్లులు పంపేటప్పుడు దానికి కారణాలేవీ తెలపలేదన్న విషయాన్ని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పున్ణపరిశీలనకు బిల్లులను పంపేటప్పుడు వాటికి కారణాలను ఒక నోట్ రూపంలో తెలియజేయాలని రాజ్యాంగ నిబంధనలు చెబుతున్నాయని, అయితే, గవర్నర్ కేవలం ''నేను ఆమోదం నిలుపుదల చేస్తున్నాను'' అని ఒక్క ముక్క మాత్రమే పేర్కొన్నారని వారు తెలిపారు.
- బిల్లును సభకు పంపకుండా గవర్నర్ సమ్మతి నిలుపుకోగలరా?
విచారణ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం బిల్లులకు సంబంధించి గవర్నర్‌కు ఉన్న అధికారాలను కూడా ధర్మాసనం పరిశీలించింది. ''ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్‌కు మూడే ఆప్షన్స్ ఉంటాయని, ఆయన వద్దకు వచ్చిన బిల్లులకు ఆమోదం తెలపడం, పున్ణపరిశీలనకు వెనక్కి పంపడం, రాష్ట్రపతికి నివేదించడం. అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లులను పున్ణపరిశీలన కోసం గవర్నరు వెనక్కి పంపాల్సి వస్తే వీలైనంత త్వరగా ఆ పనిచేయాల్సి ఉంటుందని, లేకుంటే అది రాజ్యాంగ నిబంధనలను అపహాస్యం చేయడమేనని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అన్నారు.
తమిళనాడు ప్రభుత్వం తరపు మరో సీనియర్ న్యాయవాది పి. విల్సన్ వాదనలు వినిపిస్తూ గవర్నర్‌ను నిరవధికంగా బిల్లులను నిలుపుదల చేయడానికి అనుమతిస్తే, పాలన స్తంభించిపోతుందని అన్నారు. అదీగాక గవర్నర్‌కు అటువంటి అధికారమేదీ రాజ్యాంగం ఇవ్వలేదని పేర్కొన్నారు. బిల్లును సభ మళ్లీ ఆమోదించిన తర్వాత గవర్నర్ బిల్లును రాష్ట్రపతికి పంపగలరా? అని సిజెఐ ప్రశ్నించగా, అటువంటి అవకాశమే లేదని సీనియర్ న్యాయవాదులు సింఘ్వీ, రోహత్గీ ఏకగ్రీవంగా బదులిచ్చారు. ''గవర్నర్ రవి ఇంతకుముందు కూడా చాలా ఆలస్యం తరువాత నీట్ మినహాయింపు బిల్లును వెనక్కి పంపారు. అసెంబ్లీ మళ్లీ బిల్లును ఆమోదించిన తరువాత మాత్రమే దానిని రాష్ట్రపతికి పంపారు. ఆన్‌లైన్ గేమింగ్‌పై నిషేధం కోరుతూ వచ్చిన బిల్లుపై ఆయన ఇదే వైఖరిని అవలంబించారు'' అని తెలిపారు. గవర్నర్ కార్యాలయానికి మొత్తం 181 బిల్లులు వచ్చాయని, వాటిలో 152 బిల్లులకు ఆమోదం లభించిందని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. ''ఐదు బిల్లులను ప్రభుత్వమే ఉపసంహరించుకుంది. రాష్ట్రపతి ఆమోదం కోసం తొమ్మిది బిల్లులు రిజర్వ్ చేయబడ్డాయి. పది బిల్లులకు ఆమోదం నిలుపుదల చేయబడ్డాయి. 2023 అక్టోబర్‌లో వచ్చిన ఐదు బిల్లులు పరిశీలనలో ఉన్నాయి'' అని తెలిపింది.