న్యూఢిల్లీ : ప్రముఖ రచయిత కబీర్ పద్యంతో మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చురకలంటించారు. ''ఓ పనిని రేపు చెయ్యాల్సి వుంటే నేడు పూర్తి చేయి. నేడు చెయ్యాల్సిన పనిని ఇప్పుడే పూర్తి చేయి'' అన్న కబీర్ పద్యాన్ని గురువారం రాజ్యసభలో ఖర్గే ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుని వాయిదా వేయకుండా తక్షణమే అమలు చేయాలంటూ మోడీ ప్రభుత్వానికి చురకలంటిచారు. ''మహిళా రిజర్వేషన్ బిల్లుని అమలు చేయడం మీకు కష్టతరం కాదు. కానీ మీ ప్రభుత్వం ఈ బిల్లుని 2031 వరకు వాయిదా వేసింది. అంటే దీని ఉద్దేశం ఏమిటో చెప్పాలి'' అని డిమాండ్ చేశారు. పంచాయితీ ఎన్నికలు, జిల్లా పంచాయితీ ఎన్నికలకు మహిళలకు రిజర్వేషన్లు అమలులోకి వచ్చినపుడు.. ఇప్పుడు ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించారు. 2024 లోక్‌సభ ఎన్నికలనాటికి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లను కేటాయించేలా బిల్లును సవరించాలని ఖర్గే డిమాండ్ చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది, నేడు రాజ్యసభలో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. ఉభయ సభల్లోనూ ఆమోదం పొందినప్పటికీ.. దీని అమలు మాత్రం 2029 తర్వాతేనని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లబ్థి పొందేందుకు, ఓట్ల కోసం బిజెపి ఎన్నికల ముందు ఈ బిల్లుని ప్రవేశపెట్టిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఐదు రోజుల ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లుని ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించాయి.