కర్మంటావు ఖర్మంటావు
లేశమైనా ప్రయత్నం చేయనంటావు
మోసాలను చూస్తూనే ఉంటావు
సహిస్తూనే సంచరిస్తూనే ఉంటావు
ఎదురు తిరగాలన్న ధ్యాసని మాత్రం
దరిచేరనీయనంటావు దాక్కుంటావు
సంఘానికి తిరగబడే సింహాలను
భయంగానే ఓ కంట కనిపెడుతూ
నిష్క్రియాలోలత్వంతో జతపడి
సంసారం చేస్తుంటావు
సంధి చేసుకుంటావు
ప్రకృతికి ఎదురేగిన మానవుల
విజయాల విస్తృతి తెలీదంటావు
నాణానికి రెండు వైపులున్నా
ఒకవైపే ఉందని నటిస్తుంటావు
నమ్మించ ప్రయత్నిస్తూ వుంటావు
నటనలో జీవిస్తుంటావు
అందరి శ్రమను ఒకటిగ చేసి
పెట్టుబడి పోగుపడితే పొగరుపడితే
డబ్బున్నోడి అందలాల ఆనందాలను
నీ సొంతమనుకొని ఊగిపోతావు
గడ్డిపోచ బరువుతో తేలిపోతావు
ఊహల్లో కూడ అన్యాయాన్నెదిరించక
ఉగ్గుపాలతో అలవాటైన దాస్యానికి
దార్శనికులమని చెప్పే నాయకుల
నయవంచన పంచన చేరతావు
జరుగుతున్న మోసాన్ని చూడమంటే
ఇప్పుడేమంటావు అదే అంటావు
నీ కర్మ అంటావు నీ ఖర్మ అంటావు!
- జంధ్యాల రఘుబాబు
9849753298










