Nov 20,2023 09:17

తెలుగు నాట వివిధ కాలాల్లో సాగిన ఉద్యమాలకు, సామాజిక పరిస్థితులకు అద్దం పట్టే అపూర్వ కథల సంకలనం 'గుంటూరు కథలు'. ప్రముఖ సాహితీవేత్త, అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ప్రస్తుత అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీ నారాయణ సంపాదకత్వంలో 2013లో ఈ కథా సంకలనం వెలువడింది. ఇది జరిగి కూడా దశాబ్ద కాలం నిండింది. ఈ సందర్భంగా ఈ కథా సంకలనాన్ని, అందులోని కథలను ఒకసారి అవలోకిద్దాం.
           'గుంటూరు కథలు' వివిధ సామాజిక స్థితిగతులను, మానవ సంఘర్షణలను అపూర్వమైన జీవన చిత్రణలను మన ముందుంచుతాయి. సుమారు 70 మంది ప్రముఖ రచయితలు రాసిన కథలతో కూర్చిన కథా సంకలనం ఇది. అక్కిరాజు ఉమాకాంతమ్‌ తొలి కథ 'అన్నపూర్ణ'తో ప్రారంభం అయ్యే ఈ సంకలనం, వేదగిరి రాంబాబు కథ 'తల్లి'తో ముగుస్తుంది. ఈ 70 మంది రచయితల కథలనూ- అవి రాసిన కాలంలోని సాంఘిక పరిస్థితులను బట్టి రకరకాల ఉద్యమాలను ఎలా ప్రతిబింబించాయో తెలిపేట్లుగా వర్గీకరించారు. కనపర్తి వర లక్ష్మమ్మ (1896-1978) 'దీర్ఘసుమంగళీ భవ' (భారతి, ఆగష్టు, 1928) కథతో 'సంస్కరణోద్యమం - స్వాతంత్రోద్యమం' కధల్లోకి చొచ్చుకు రావటం ప్రారంభం అయింది. వజ బాబురావు ('మల్లు పంచె', భారతి మాస పత్రిక), కేెవి.సుబ్బయ్య ('ఆత్మశాంతి', ఆంధ్ర విద్యార్థి పక్ష పత్రిక, డిసెంబర్‌ 15, 1947), బొల్లిముంత శివరామకృష్ణ ('దేశం ఏం కావాలి?') వంటి వారి కధలను ఈ ఉద్యమానికి తొలి పునాది రాళ్లను వేసినట్టుగా పరిగణించారు.
         తరువాతి కాలంలో తెలుగునాట 'కమ్యూనిస్టు ఉద్యమం ప్రధాన పాత్ర పోషించింది. మునిపల్లె వీర్రాజు ('దొడ్డమ్మ వారసులు', స్వాతి, ఏప్రిల్‌, 1988), కొడవటిగంటి కుటుంబరావు ('పైకివచ్చినవాడు', ఆంధ్రప్రభ వారపత్రిక, డిసెంబర్‌ 8, 1954), రావూరి భరద్వాజ (ఎందుకైనా మంచిది, కథావాహిని-3, 1954), ఆలూరి భుజంగరావు ('నిన్నటికి నేడు ఏమవుతుంది? అరణ్యపర్వం, కథా సంపుటి, జనవరి 1997), నల్లూరి రుక్మిణి, 'బీటలెత్తిన బీళ్ల కోసం' (అరుణతార, మే 2003) కథల్లో కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం కనిపిస్తుంది. ఈ ఉద్యమాల వర్గీకరణ చేయటం, వాటి కింద కొంతమంది రచయితల పేర్లు మాత్రమే ఇవ్వటం అనేది ఒక సూచనా మాత్రంగానే పరిగణించాలి. ఈ ఉద్యమాలకు బీజాలు పడేందుకు తొలినాళ్లలో గొప్ప కథలు రాసిన వారిలో వీరూ కొందరిని అర్థం చేసుకోవాలి .
         శ్రమ, కులం , మతం కింద 9 మంది ప్రసిద్ధ కథా రచయితలను చేర్చారు. వట్టికొండ విశాలాక్షి (రిక్షావాలా, ఆంధ్ర జ్యోతి, 1954)తో ప్రారంభించి, గోపీచంద్‌ (చెప్పులు కుట్టేవాడు, పతితులు కథా సంపుటి, 1985), మా గోఖలే (ముత్తాయి కూతురు, భారతి, మార్చి 1956), పెనుమాక నాగేశ్వర రావు (అనుగ్రహం, ఆంధ్రభూమి మాసపత్రిక), బి.పి.కరుణకుమార్‌, ప్రతాప రవిశంకర్‌ వంటి రచయితల కథలు ఇందులో చేరాయి. 'సంసారం -స్త్రీ' ప్రధాన భూమికగా మునిమాణిక్యం నరసింహారావు, (మా అల్లుడు, నవ కధావళి), పి.ఎస్‌.నారాయణ (గొడుగు నీడ, ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక, మార్చి, 3 2006), వాసిరెడ్డి సీతాదేవి (తరాలు-అంతరాలు, అన్నదాత, మార్చి 1969), పి.సత్యవతి (పెళ్లిప్రయాణం, ఇండియా టుడే వార్షిక సాహిత్య సంచిక 1995), ఓల్గా (పురిటి నొప్పులు, ఆదివారం, వార్త దినపత్రిక, మే 11, 1997), కేతు విశ్వనాధ రెడ్డి (ఇచ్ఛాగ్ని, ఇండియా టుడే వార్షిక సాహిత్య సంచిక, 1995) వంటి హేమాహేమీల కథలుఉన్నాయి.
         సంస్క ృతి - చరిత్ర విభాగం కింద ఎనిమిది కథలు పొందుపరిచారు. అందులో మల్లాది రామకృష్ణ శాస్త్రి 'డుమువులు' కథ నుంచి, శారద రాసిన 'కౌముది (కథా వాహిని, 1955), పోరంకి దక్షిణామూర్తి 'చంద్రవంక' (కలకత్తా ఆంధ్ర సంఘం వారి ద్వాదశ వార్షిక సంచిక 1965), పొత్తూరి విజయలక్ష్మి కథ సభల సంరంభం దాకా ఉన్నాయి. వ్యవసాయం కింద జి.వి.కృష్ణారావు 'చేసుకున్న కర్మ', తాళ్లూరి నాగేశ్వరరావు 'మమతా- భ్రమత', పాపినేని శివశంకర్‌ 'చింతల తోపు, వల్లూరి శివప్రసాద్‌ 'గిట్టుబాటు', ఎంవి రామిరెడ్డి 'ఓ రైతు ఆత్మ కథ'లను చేర్చారు. విద్య - జన్మభూమి శీర్షికన తల్లావఝ్జల శివశంకర శాస్త్రి కధ, బొల్లిముంత నాగేశ్వర రావు 'ఓ డాక్టర్‌ కథ', చలం 'శమంతకమణితో ఇంటర్వ్యూ', కొలకలూరి ఇనాక్‌ 'పుట్టినూరు' వంటి కధలున్నాయి. గ్రామీణం శీర్షికన గోపరాజు నాగేశ్వరరావు 'దూడ బాతు', పి.చంద్రశేఖర ఆజాద్‌ 'ఏరు', విహారి 'దోసిట్లో చీకటి', కె.శరశ్చంద్ర జ్యోతిశ్రీ 'పెదవడ్లపూడి రైల్వేస్టేషన్‌' వంటి కథలు చేర్చారు. 'మరికొన్ని' శీర్షికన కొడవటిగంటి కృష్ణమూర్తి 'అభివృద్ధి', చందు సుబ్బారావు 'చీలిక' చేర్చారు. విజయం శీర్షికన శ్రీ రమణ 'ధనలక్ష్మి', కాకాని చక్రపాణి 'మూడో మనిషి', 'ఆదర్శం' శీర్షిక కింద సత్యం శంకరమంచి 'వరద', పెద్దిభొట్ల సుబ్బ రామయ్య 'పేరయ్య బావి', వాణిశ్రీ 'చూపు', వేదగిరి రాంబాబు 'తల్లి' పొందుపరిచారు.
ఈ సంకలనంలో ఏ కథకు ఉండే గొప్పతనం దానిదే! 'తొలి తెలుగు కధా రచయిత గుంటూరు సీమ వాడవటం గర్వకారణం' అంటారు పెనుగొండ లక్ష్మీ నారాయణ. అందుచేత ముందు ఆనాటి కథ ఎలా ఉందో 'అన్నపూర్ణ' కథను టూకీగా వివరిస్తాను. సుమారు వందేళ్ల క్రితం భారతీయ గ్రామీణ జీవనం, అప్పటి వివాహ పద్ధతులు, నాడు స్త్రీలు అపరిపక్వ వయస్సులో తమ సమ వయస్కుడు కాని పురుషుడిని వివాహం చేసుకొని వారితో పిల్లలను కనటం, ఆ సంతానం తరుచూ మరణిస్తూ తొలుత తల్లికి, తరువాత వయస్సు ముదిరిన భర్తకు ఎలా నరకప్రాయంగా మారుతాయో కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరించారు రచయిత ఉమాకాంతం. ఆ సమాజంలో నరసింహుడు అనే చైతన్యం ఉన్న సోదరుడు అన్నపూర్ణ భవిష్యత్తు గురించి వేదన పడటం ఎంతో కలచి వేస్తుంది. వయసు ముదిరిన సూర్యనారాయణ సాముద్రికం చెప్పే వాడి మాటలు నమ్మి పిల్లలపై పిల్లలని కని, వాళ్ళు వరుసగా చనిపోతుంటే తట్టుకోలేక మంచానపడి మరణించటం, అన్నపూర్ణ కాళ్ళు చచ్చుపడి లేవ లేని స్థితిలో ఉండటం కళ్ళ వెంబడి నీరు జలజలా రాలేట్టు చేస్తుంది. అలాగే కనపర్తి వరలక్ష్మమ్మ రాసిన 'దీర్ఘసుమంగళీ భవ' కథ వితంతు పునర్వివాహం చుట్టూ అల్లినది. వరలక్ష్మమ్మ ఈ కథకు సైద్ధాంతిక బలం జోడిస్తూ, ఒక అద్భుతమైన ఎత్తుగడ వేసి, ఆ ఎత్తుగడలో నాటి బ్రాహ్మణ సమాజ గుత్తాధిపత్యానికి మంగళం పాడిస్తుంది. తొలుత గుత్తాధిపత్యం వెలగబెట్టే పాత్రలను, అవి సష్టించే అరాచకాలను ఆవిష్కరిస్తారు రచయిత్రి. తరువాత చీమల్లాంటి పాత్రలతో పెత్తందారుల దాష్టీకాలకు ప్రతి ఎత్తులు వేయిస్తారు. పరశురాములు, శివయ్య శాస్త్రి బ్రాహ్మణీకాన్ని అడ్డుపెట్టుకొని అవసరం ఉన్న వాళ్ళకు అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి వాళ్ళ కష్టార్జితాన్ని దోపిడీ చేస్తుంటారు. వీరిరువురి ఇళ్లల్లోనే జన్మించిన శంకరం, పార్వతి తమ తండ్రుల దురాగతాలను ఎండకడుతూ లేచి పోయి గుంటూరులో పెళ్లిచేసుకొంటారు. పార్వతి తన మనోగతాన్ని వెల్లడిస్తూ పరాశరుడు, వశిష్టులను ఉటంకిస్తూ తమ పునర్వివాహం శాస్త్ర సమ్మతమేనని, అందుకు అంగీకరించమని తన తండ్రిని ప్రార్ధిస్తూ ఉత్తరం రాయటం కథకే హై లైట్‌.
            నల్లూరి రుక్మిణి రాసిన 'బీటలెత్తిన బీళ్ళ కోసం' కథ హదయాల్ని ద్రవింపచేస్తుంది. కరువు బారిన పడిన రైతులు పొట్టపట్టుకొని, గొడ్డూ గోదాను వెంటేసుకొని అడవి మార్గం పట్టిన వైనాన్ని గుండెలు బరువెక్కేలా వర్ణిస్తుంది. ఆ రైతులు అన్నలకు, పోలీసులకు 'ఇన్‌ఫార్మర్లు'గా కనిపిస్తారు. అన్నల చేతిలో 'బతుకు జీవుడా' అని తప్పించుకున్నా, పోలీసుల చేతిలో చచ్చి శవాలుగా మారటంతో కథ ముగుస్తుంది. ఆద్యంతం ద్ణుఖభరమై సాగే ఈ కథాకథనం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కొడవటిగంటి కుటుంబరావు కథ 'పైకి వచ్చిన వాడు' నాటి గ్రామీణ ముఖచిత్రాన్ని, సగటు మనిషైన సీతారామారావు (కధకు ప్రధానపాత్ర ఇదే) గ్రామీణ జీవితం నుంచి పట్టణ స్థాయి ఉద్యోగానికి వెళ్ళేప్పటికీ సమాజంలో రాజకీయంగా, ఆర్ధికంగా ఎన్ని మార్పులు చేసుకొన్నాయన్నది కళ్ళకు గట్టినట్టు చిత్రీకరిస్తుంది. పి.ఎస్‌.నారాయణ 'గొడుగు నీడ' మోడు బారిన భార్యాభర్తల సంబంధాల్లో కూడా తిరిగి పచ్చదనం చిగురిస్తుందని తెలిపే కథ. తల్లావఝ్జుల శివ శంకరశాస్త్రి గారి కథ 'గాదె' ఆసాంతం పొట్ట పగిలేలా హాస్యం పండిస్తోంది. ఈ కథలో ఆనాటి పాఠశాల ఉపాధ్యాయుల మనస్తత్వ చిత్రీకరణ ఉంది.
వేరు వేరు కాలాల్లో వచ్చిన తెలుగు కథలు ఇవ్వడం ఈ సంకలనానికి ఆయువుపట్టు వంటిది. సాహిత్య, సామాజిక పరిశోధనా ప్రియులకు ఈ కథా సంకలనం అందించే ముడిసరుకు అపారమైందని చెప్పొచ్చు. ఆయా కాలాల్లో సమాజంలో ప్రధాన సమస్యలు ఏమిటి అన్నది సులువుగా ప్రోది చేయవచ్చు. భిన్న రచయితలు ఆయా సామాజిక సమస్యలను ఎలా దర్శించారో, ఎలా విశ్లేషించారో మరోసారి పరిశోధకులు కొత్తగా వాటిని దర్శించి ఆధునిక సామాజిక సైద్ధాంతిక నేపథ్యంలో వివరించవచ్చు. నాటి సాహిత్య విలువలు, భాషా ప్రయోగాలు, వాక్య నిర్మాణాలు మనకెంతో లోతైన అవగాహన నిస్తాయి. కనపర్తి లక్ష్మమ్మ వాడిన అనేక భాషా శబ్దాలు అచ్చ తెలుగువి. ఉదాహరణకు 'ఉమ్మాలికము', 'వేష్టపడ్డారు' వంటివి కొన్ని. ఆవిడ వాక్య వ్యంగ్య నిర్మాణాలు గూడా అలానే ఉంటాయి. 'బుద్ధిశాలియగు విష్ణు శర్మ రాజకుమారులకు హితోపదేశం సేయుటకు కరటక దమనకుల నేనాడు సృష్టించెనో కాని, తత్సంతతి వారు ఇప్పటికినీ ఉన్నారు' అంటుంది. కథా సాహిత్యానికి సంబంధించిన అనేక విషయాలను లక్ష్మీనారాయణ ఈ సంకలనం ప్రారంభంలో వివరించారు. సాహిత్య పరిశోధకులకు, కథాప్రియులకు, సామాజిక చరిత్ర పరిశోధకులకు ఈ పుస్తకం అమూల్యమైనది.

- డా. కొప్పరపు నారాయణ మూర్తి
76719 09759