Nov 20,2023 08:59

1
వాళ్ళే నక్షత్రాల చెట్ల కిందో
హాయిగా ఆడుకునేవాళ్ళు
కాళ్ళు బారజాపుకుని వాళ్ళాడుకుంటుంటే
గ్రహాలు వాటి నడకల్ని సర్దుకునేవి
పాలపుంతల అంచులు మీదుగా
పాటలు పాడుకుంటూ వాళ్ళు సాగిపోతుంటే
ఆ సందడిలో కాలం తప్పిపోయేది
వాళ్ళ అమాయకపు నవ్వుముఖాలతో
దిగంతాలు వెలిగేవి
వాళ్ళ చిట్టి రెక్కల మీద రంగువిల్లులు విరబూసేవి

2
అందమైన నేలుందని కదా
వాళ్ళనిక్కడికి ఆహ్వానించాం
ఏ రక్తపు మరకలూ అంటని పొత్తిళ్ళను
ఏ విభజన రేఖలూ లేని ప్రపంచాన్ని కదా
వాళ్ళకు వాగ్దానం చేశాం
పాటలు పాడే నదులతో సహా
నీలిసముద్రాల మీద కురిసే వెన్నెలంతా
వాళ్ళదేనని కదా ఆశ పెట్టాం
ఇక్కడ విరిసే ప్రతి పువ్వు మీదా
రెక్క విప్పుకునే ప్రతి ఉదయం మీదా
వాళ్ళదే అధికారమని కదా నమ్మబలికాం

3
మొదట, వాళ్ళు ఆడుకునే మైదానాల మీద
మన ఇష్టానికి కొన్ని గీతలు గీసాం
అచ్చం అరణ్యాల మీదా, శిఖరాల మీదా
అలవాటుగా అడ్డదిడ్డంగా గీసినట్టుగానే !
రంగులుగా విడగొట్టాం
మతాలుగా, జాతులుగా విడగొట్టినట్టే !

వాళ్లు నేలంతా బొమ్మలు గీయాలని చూస్తారు
మనం ఎరేజర్లను తయారుచేస్తాం
వాళ్ళు బడిని తోటనుకుని పూలసజ్జలతో వస్తారు
మనం తుపాకుల కళ్ళతో గది గదినీ గాలిస్తాం
వాళ్ళు చేతుల నిండా
స్వప్నాలను పట్టుకుని మేల్కొంటారు
మనం వాళ్ళ స్వప్నాలను లాక్కొని
ఖాళీ చేతులతో వెళ్లగొడతాం
వాళ్ళు మెరిసే నవ్వులతో
రోజుకో సూర్యుడ్ని వేలాడదీస్తారు
మనం ఆరిపోయిన దీపాల్ని తెల్లని బట్టల్లో చుట్టి
కన్నవాళ్ళకి అప్పగిస్తాం
ఎడతెరిపిలేని యుద్ధంలో
వాళ్ళు పుస్తకాల్ని వెతుక్కుంటుంటే
మనం తెగిన శత్రువుల తలల్ని లెక్కలేసుకుంటుంటాం

4
వాళ్ళేదో రోజు
అలిగి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతారు
వెళ్తూ వెళ్తూ దేవుణ్ణి కూడా వెంట తీసుకుపోతారు
అప్పుడిక
ఈ మృతగ్రహంమీద జీవించడానికి
ఒక్కటంటే ఒక్క కారణమూ దొరకదు
- రాధ