
రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని పక్కదారి పట్టించడానికి మతోన్మాదాన్ని ముందుకు తెస్తున్నది. కులమత భావోద్వేగాలను రెచ్చగొడుతున్నది. ఒక పథకం ప్రకారం మన రాష్ట్రంలో మత చిచ్చు రగల్చడానికి అనేక కుతంత్రాలు పన్నింది. కేంద్రంతో సఖ్యత, బిజెపితో రాజీ ఫలితంగా వైఎస్సార్‌సిపి వీటిని ఎదుర్కోలేకపోతున్నది. లౌకికతత్వానికి కట్టుబడి ఉన్న పార్టీగా చెప్పుకుంటూ మైనారిటీలు, దళితులు, మహిళల రక్షణ పట్ల ఉపేక్షాభావంతో వ్యవహరిస్తున్నది. ఈ తరగతుల్లో అభద్రతా భావం పెరుగుతున్నది. వైఎస్సార్‌సిపి దానిని గుర్తించి తగిన చర్యలు తీసుకోకపోతే మన రాష్ట్రంలోనూ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల విచ్ఛిన్నకర ఎత్తుగడలకు ప్రజలు బలి కావాల్సి వస్తుంది. బిజెపితో దోస్తీ అంటే మతోన్మాదంతో రాజీనే. ఇప్పటికైనా లౌకిక పార్టీగా మతోన్మాద భావజాలాన్ని, బిజెపి కుట్రలను ఎదుర్కొనేందుకు వైసిపి ముందుకు రావాలి.
నేడు, రేపు (8,9 జులై) రెండు రోజులపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి సమావేశాలు ఇవి. గత మూడు సంవత్సరాల పాలనలో తమ విధానాలను పరిశీలించుకొని సరిదిద్దుకోడానికి ఇదొక అవకాశం. కానీ వారి ఎజెండా చూస్తే ఆ దిశగా ఆత్మ పరిశీలన జరిగేట్లు కనిపించడంలేదు. దిగువ స్థాయి ప్లీనరీ సమావేశాల్లో వ్యక్తమైన అభిప్రాయాలనైనా పరిగణన లోకి తీసుకొని రాష్ట్ర ప్లీనరీలో తమ విధానాలపై పునరాలోచనకు పూనుకుంటుందా? లేదా? వేచి చూడాలి.
ప్రజల్లో తగ్గుతున్న ఆదరణ
వైఎస్సార్‌సిపి 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. నాడు అధికారంలో ఉన్న తెలుగుదేశంపై ప్రజల్లో వ్యతిరేకత, జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా చేసిన వాగ్దానాలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర బిజెపి చేసిన విద్రోహంపై పోరాడతారన్న విశ్వాసం విజయానికి కారణమయ్యాయి. అధికారం చేపట్టాక నవరత్నాల పేరుతో దశలవారీ ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో వైఎస్సార్‌సిపి పట్ల సానుకూల వాతావరణాన్ని సృష్టించాయి. అయితే క్రమంగా సంక్షేమ పథకాలపై వివిధ రూపాల్లో కోత, ఉద్యోగ, ఉపాధ్యాయులు, మధ్యతరగతి ప్రజలకిచ్చిన పిఆర్‌సి, సిపిఎస్ వంటి వాగ్దానాలు అమలు చేయకపోవడంతో ఆయా తరగతుల్లో ఆందోళన మొదలయ్యింది. అది ఉద్యమ రూపం కూడా తీసుకుంది. హెల్త్ అలవెన్సు, జీతాల సమస్యపై జులై 11 నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. కరోనా కాలంలో కేంద్రం మొండిచెయ్యి చూపిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకాలు కొంత ఊరటనిచ్చాయి. కానీ ఆ తరువాత నిధుల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో ప్రజలపై భారాలు వేయడం మొదలుపెట్టింది. గత ఐదారు మాసాలుగా ఈ భారాలు, ఛార్జీల మోతతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. వైఎస్సార్‌సిపిని బలపరుస్తున్న ప్రజల్లోనూ అసంతృప్తి మొదలైంది. వారి కార్యకర్తల్లోనూ వివిధ రూపాల్లో వ్యక్తమవుతున్నది. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి వికేంద్రీకరణ పేరుతో చేరువగా పెట్టిన సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు ప్రజల్లో అనేక ఆశల్ని కల్పించాయి. సంక్షేమానికి బాసటగా ఉంటాయనుకున్న ఈ వ్యవస్థలు క్రమంగా భారాలకు నెలవుగా మారడంతో ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. మారుతున్న ఈ పరిస్థితిని వైఎస్సార్‌సిపి గుర్తించినట్లుగానీ, గమనంలోకి తీసుకున్నట్లుగానీ లేదు. విన్నాను, కన్నాను.. ప్రజలతోనే వుంటానంటూ వాగ్దానం చేశారు. మాట తప్పను, మడమ తిప్పను అన్నారు. రాజశేఖరరెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ప్రజలు ఓట్లువేశారు. మూడేళ్ల లోనే మడమ తిప్పడం మొదలైంది.
ప్రత్యేక హోదా కోసం పోరాటం ఏదీ?
2019 ఎన్నికల నాటికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు ఎజెండా ప్రముఖంగా ముందుకొచ్చింది. తెలుగుదేశం ఈ కారణంచేతనే బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఏ కూటమి నుండి బయటకు వచ్చింది. 25 మంది ఎంపీలను గెలిపిస్తే తాను ఢిల్లీ నుండి ప్రత్యేక హోదా సాధించుకొస్తానని జగన్‌మోహన్‌రెడ్డి పదే పదే ప్రకటించారు. కానీ ఎన్నికలై అధికారం చేపట్టిన కొద్ది రోజులకే బిజెపి సొంతంగా అధికారంలోకి వచ్చినందున ప్రత్యేక హోదాపై పోరాడి సాధించలేమని, మెల్లగా అడుక్కుందామంటూ జగన్ ఆది లోనే మాట తప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కేంద్రంతో రాజీ, లాలూచీ తప్ప రాష్ట్రానికి రావాల్సిన ఏ హక్కుపైనా వైఎస్సార్‌సిపి ప్రభుత్వం పోరాడలేదు. కనీసం గట్టిగా నిలదీసిన సందర్భం కూడా లేదు. నల్ల వ్యవసాయ చట్టాల నుండి రాష్ట్రపతి ఎన్నికల వరకు బిజెపిని బేషరతుగా బలపరుస్తూ వస్తోంది. ఈ లొంగుబాటు వైఖరితో రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోని అన్ని పక్షాలను ఏకతాటి పైకి నడిపించి కేంద్రంపై పోరాడి ప్రత్యేకహోదా సాధించాల్సిన ప్రభుత్వం అందుకు చొరవ చూపాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్ను చూపటం రాష్ట్ర ప్రజలను ఆశాభంగానికి గురిచేసింది. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి నాడు తెలుగుదేశం ఏ తప్పు చేసిందో, నేడు వైఎస్సార్‌సిపీ కూడా అదే తప్పు చేస్తున్నది. వైఎస్సార్‌సిపి, తెలుగుదేశం, జనసేన నాడు ప్రత్యేకహోదా కోసం పరస్పరం సవాళ్ళు విసురుకొని నేడు పూర్తిగా మౌనం దాల్చడంతో ఈ ఎజెండా అటకెక్కించారు. ఎవరి అవసరం కొద్దీ వారు బిజెపితో రాజీ పడ్డారు. నాడు నేడూ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకోసం వామపక్షాలు మాత్రమే నికరంగా నిలబడి పోరాడుతున్నాయి.
మతోన్మాదం పట్ల ఉపేక్ష
రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని పక్కదారి పట్టించడానికి మతోన్మాదాన్ని ముందుకు తెస్తున్నది. కులమత భావోద్వేగాలను రెచ్చగొడుతున్నది. ఒక పథకం ప్రకారం మన రాష్ట్రంలో మత చిచ్చు రగల్చడానికి అనేక కుతంత్రాలు పన్నింది. కేంద్రంతో సఖ్యత, బిజెపితో రాజీ ఫలితంగా వైఎస్సార్‌సిపి వీటిని ఎదుర్కోలేకపోతున్నది. లౌకికతత్వానికి కట్టుబడి ఉన్న పార్టీగా చెప్పుకుంటూ మైనారిటీలు, దళితులు, మహిళల రక్షణ పట్ల ఉపేక్షాభావంతో వ్యవహరిస్తున్నది. ఈ తరగతుల్లో అభద్రతా భావం పెరుగుతున్నది. వైఎస్సార్‌సిపి దానిని గుర్తించి తగిన చర్యలు తీసుకోకపోతే మన రాష్ట్రంలోనూ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల విచ్ఛిన్నకర ఎత్తుగడలకు ప్రజలు బలి కావాల్సి వస్తుంది. బిజెపితో దోస్తీ అంటే మతోన్మాదంతో రాజీనే. ఇప్పటికైనా లౌకిక పార్టీగా మతోన్మాద భావజాలాన్ని, బిజెపి కుట్రలను ఎదుర్కొనేందుకు వైసిపి ముందుకు రావాలి. లేదంటే వచ్చే విష పరిణామాలకు వైసిపి బాధ్యత వహించాలి.
కేంద్రం వడ్డన - స్పందించని వైసిపి
గత ఐదారు మాసాల్లోనే ప్రజలపై నడ్డివిరిచే భారాలు పడ్డాయి. కేంద్రం వడ్డించిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల భారాలకు...రాష్ట్ర ప్రభుత్వ భారాలు తోడై ప్రజలను మరింత కుంగదీస్తున్నాయి. కేంద్రం ఇష్టానుసారం పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచుతున్నప్పటికీ వైఎస్సార్‌సిపి నుండి కించిత్తు ప్రతిఘటన కూడా లేదు. కేంద్రం పాపాల్ని కూడా తమ ఖాతా లోనే వేసుకుంటున్న ఘనులు వీరు.
పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ కేంద్రం నుండి రావాల్సిన సహాయం అందలేదు. నిర్వాసితులైన పేద ఆదివాసీలంతా అటూ అభివృద్ధికి, ఇటు సంక్షేమానికి నోచుకోక త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. 2021 డిసెంబర్ నాటికే పూర్తవుతుందనుకున్న పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని దుస్థితికి చేరుకున్నది.
వైఎస్సార్‌సిపి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు ప్రకటించడంతో అమరావతి అభివృద్ధి కుంటుపడింది. గత ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని మాస్టర్ ప్లాన్‌తో ఒక తప్పు చేస్తే ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభిమతానికి విరుద్ధంగా అసలు రాజధానినే మార్చేసింది. రాజధాని అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు ఇవ్వలేదు. వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నమూ చేయలేదు.
ఆంధ్రుల ఆత్మగౌరవ చిహ్నంగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం దుర్మార్గంగా ప్రయివేటుపరం చేస్తుంటే నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి గట్టి ప్రయత్నం జరగలేదు. కార్మికులు జీవన్మరణ పోరాటం చేస్తుంటే నామక: తమ వ్యతిరేకతను ప్రకటించి కూర్చుంది. ఇప్పటికైనా వైఎస్సార్‌సిపి చొరవ తీసుకొని అన్ని పక్షాలను కలుపుకొని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణను నిలువరించాలి. తన చిత్త శుద్ధిని నిరూపించుకోవాలి.
కుంటుపడిన అభివృద్ధి
విభజన హామీల్లో భాగంగా ఉన్న కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టు నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదు. కేంద్రీయ విద్యాలయాలకు నిధులూ రావడం లేదు. లోటు బడ్జెట్ పూడ్చుకోవడానికి రూ. 35 వేల కోట్లు బకాయిలు అలాగే ఉన్నాయి. జిఎస్టీలో మన వాటా ఇవ్వకుండా షరతులు పెట్టి అప్పులు తెచ్చుకోమంటే రాష్ట్ర ప్రభుత్వం తలూపింది. కేంద్రం ఇంత అన్యాయం చేస్తున్నా పల్లెత్తు మాట అనకపోవడం, నిధుల కోసం ప్రయత్నించకపోవడం, మన రాష్ట్ర హక్కుల్ని కేవలం కాగితాలకే పరిమితం చేయడం ఈ ప్లీనరీలో వైఎస్సార్‌సిపి ఏ విధంగా సమర్థించుకుంటుందో చూడాలి. కేంద్రం నుండి పోరాడి నిధులు రాబట్టుకోకపోగా ఆ లోటును పూడ్చుకోవడానికి ప్రజలపై అదనపు భారాలు మోపుతున్నది.
సంక్షేమానికి కోతలు
ఈ కాలంలో రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఆర్థిక సంక్షోభానికి తోడు రాష్ట్ర ఖజానా నింపుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం శాఖలవారీ పిండటానికి తయారైంది. దుల్హన్ వంటి పథకాలను నిధులు లేక నిలిపివేసింది. అమ్మ ఒడికి కోతలు పెట్టింది. జగనన్న కాలనీలకు నిధులు లేక నత్తనడక నడుస్తున్నాయి. ప్రభుత్వ షరతులతో లబ్ధిదారులు స్థలం వదులుకోలేక ఇళ్ళు కట్టుకోలేక సతమతమవుతున్నారు.
కార్పొరేట్లకు పెద్ద పీట
కార్మిక హక్కుల్ని ఫణంగా పెట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభతర వ్యాపారం) పేరుతో బడా కార్పొరేట్ కంపెనీలకు పెద్ద పీట వేస్తున్నది. రైతులు, కూలీలు, వృత్తిదారులు, వ్యాపారులు, ఆఖరికి చిన్న కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు కూడా భారాలను భరించలేక తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కౌలురైతులకు ఏ భరోసా లేదు. జగన్ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం కౌలురైతులకు శాపంగా మారింది.
పెరుగుతున్న నిరంకుశత్వం
మరోవైపు ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని అణచడానికి నిరంకుశ చర్యలకు పాల్పడుతోంది. 30ఎ చట్టం, 144 సెక్షన్ పేరుతో ముందస్తు అరెస్టులు, నోటీసులు, వేధింపులు, కేసులు, దాడులు, అణచివేత చర్యలు నిత్యకృత్యమయ్యాయి. ప్రజా ఉద్యమాలే నేడు ప్రధాన ప్రతిపక్షంగా మారాయి. ప్రతిపక్షంలో వుండగా పౌరహక్కుల గురించి గావుకేకలు పెట్టిన జగన్ నేడు వాటినే హరిస్తున్నారు. దళితులు, మహిళలపై అత్యాచారాలు, దాడులు దారుణంగా పెరిగాయి. కనీసం ప్రజలు చెప్పేది వినేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రజల్ని కలుసుకోవడం, ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించడం ఏ కోశానా లేదు. ప్రభుత్వం ప్రజలకు బాధ్యత వహించాలన్న కనీస ప్రజాస్వామ్య సూత్రానికి చెల్లు చీటీ ఇచ్చారు.
ప్రజలపై భారాలకు ప్రతిఘటన
కేంద్ర ప్రభుత్వ షరతులకు తలొగ్గి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం, విద్యుత్, బస్సు ఛార్జీలు పెంచడం, పట్టణాల్లో చెత్తపన్ను వేయడం, నూతన విద్యావిధానం పేరుతో పాఠశాలల విలీనం, స్కూళ్ళ ఎత్తివేత, ఇసుక, మద్యం మాఫియాలు వంటి అనేక సమస్యలు ప్రజల్ని పీడిస్తున్నాయి. ఈ ప్లీనరీ జరుగుతుండగానే రైతుల, తల్లిదండ్రుల ఆందోళనలు సాగుతున్నాయి. కేంద్రంతో లాలూచీ పడి రాష్ట్రం హక్కుల్ని తాకట్టు పెట్టింది. ప్రజల మనోభావాలను గుర్తించయినా మోడీ విధానాలకు సలాం కొట్టి ఎన్నికల నాడు ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలుపై కేంద్రీకరించడం మంచిది. నాడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన పోరాట అనుభవాన్ని కూడా వైఎస్సార్‌సిపి గమనంలోకి తీసుకోవాలి. పార్లమెంటులో వ్యవసాయ చట్టాల్ని నాడు వైఎస్సార్‌సిపి, తెలుగుదేశం రెండూ బలపర్చాయి. కానీ తరువాత రైతుల్లో వచ్చిన వ్యతిరేకతతో రాష్ట్రంలో జరిగిన ఉద్యమాల పట్ల సానుకూల వైఖరి తీసుకోక తప్పలేదు. బిజెపిని బలపరిచే విషయంలో ఈ రెండు పార్టీలకు తగాదా లేదు. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎంత దుమ్మెత్తి పోసుకున్నా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న బిజెపితో అంటకాగడంలో మాత్రం పోటీ పడుతున్నాయి. అధికారంలో ఉండి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన అదనపు బాధ్యత వైఎస్సార్‌సిపిపై ఉంది. రాష్ట్రాల హక్కుల్ని కాపాడడం, ప్రజలపై కేంద్రం వేసే భారాలపై పోరాడడంలో వైసిపి చొరవే ప్రధానంగా ఉండాలి. అది చేయకపోగా నిధుల వేటలో ప్రజలపై అదనపు భారాలు మోపడం జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనపై ప్రజల్లో అసంతృప్తిని, వ్యతిరేకతను పెంచుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలే తమను గట్టెక్కిస్తాయన్న భ్రమలతో వైసిపి ఉంది. కానీ ఆ పథకాలపై కోత, మోపుతున్న అదనపు భారాలు తమ అంచనాలను తలకిందులు చేస్తాయని వారు గుర్తించడం లేదు. ఈ వాస్తవాన్ని గుర్తించి ఈ ప్లీనరీలో తమ విధానాలపై పున:పరిశీలన చేసుకొని ప్రజలకు చేరువవుతుందా? లేక దూరమవుతుందా? నిర్ణయించుకోవాలి.
వి. శ్రీనివాసరావు / వ్యాసకర్త : సిపిఎం ఎ.పి కార్యదర్శి /