Nov 21,2020 15:41

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో  కల్తీ మద్యం తాగి ఆరుగురు మృతి చెందారు. మరో 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ప్రయాగ్‌ రాజ్‌ జిల్లాలోని అమిలియా గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. బాధితులు శుక్రవారం రాత్రి ఓ షాపులో నాటు సారా తాగారని, కొంత సేపటి అనంతరం అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. వారిలో ఆరుగురు మృతి చెందగా.. మరికొంత మందిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు... గ్రామానికి చేరుకున్నారు. అనంతరం లిక్కర్‌ నమూనాలను సేకరించారు. భార్యా, భర్తలిద్దరూ ఈ మద్యం దుకాణాన్ని నడుపుతున్నారని,  కల్తీ  మద్యం అమ్మినందుకు గతంలో కూడా వీరిపై కేసులున్నాయని స్థానికులు చెబుతున్నారు. కాగా, ఈ మరణాలకు గల కారణాలను శవ పరీక్ష అనంతరం వెల్లడిస్తామని జిల్లా కలెక్టర్‌ భాను చంద్ర గోస్వామి తెలిపారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం షాపు యజమానులను అరెస్టు చేశామని చెప్పారు.
           ఇటీవల కాలంలో యుపిలో కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలనుద్దేశించి.. యోగి సర్కార్‌పై కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. లక్నో, ఫిరోజాబాద్‌, హాపూర్‌, మధుర, ప్రయాగ్‌రాజ్‌లలో పలు ప్రాంతాల్లో  కల్తీ మద్యానికి అమాయకులు బలయ్యారని, అదేవిధంగా ఆగ్రా, భాగ్‌పట్‌, మీరట్‌లో కూడా ఇటువంటి సంఘటనలు చేసుకున్నాయని, ఇటువంటి లిక్కర్‌ మాఫియాపై చర్యలు తీసుకోవడంలో యుపి సర్కార్‌ ఎందుకు వైఫల్యమైందని, దీనికి ఎవరూ బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు.