బల్లియా : వరకట్న రక్కసికి ఉత్తరప్రదేశ్‌లో ఒక మహిళ బలైంది. ఈ దారుణ ఘటన బల్లియా జిల్లాలోని అత్తిలాపూర్ గ్రామంలో చోటుచేసుకుందని పోలీసులు శనివారం తెలిపారు. రస్ర కోట్వాలి పోలీసుస్టేషన్ ఎస్‌హెచ్‌ఒ సౌరవ్ రారు తెలిపిన వివరాల ప్రకారం.. రంజనా సింగ్ అనే మహిళకు అత్తిలాపూర్ గ్రామానికి చెందిన అమ్లేష్ సింగ్ అనే వ్యక్తితో గతేడాది ఫిబ్రవరిలో వివాహమైంది. అప్పటి నుంచి కట్నం తేవాలంటూ ఆమె అత్తమామలు తరచూ వేధింపులకు పాల్పడుతుండే వారు. తాజాగా గురువారం నాడున రంజనా సింగ్‌ను అత్తమామలు దారుణంగా కొట్టి హింసించడంతో పాటు ఆమె శరీరానికి నిప్పంటించారు. దీంతో తీవ్ర కాలిన గాయాలతో ఆ మహిళ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం మరణించినట్లు ఎస్‌హెచ్‌ఒ సౌరవ్ రారు తెలిపారు. మహిళ మృతతేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు పేర్కొన్నారు. వేధింపులపై రంజనాసింగ్ తండ్రి పర్మాత్మ ఫిర్యాదు మేరకు మహిళ భర్తతో సహా మొత్తం ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసులో త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామన్నారు.










