Sep 28,2023 12:44

ఉజ్జైన్‌ : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో ఓ టీనేజ్‌ అమ్మాయి అత్యాచారానికి గురైంది. ఆ బాలికను తీవ్రంగా హింసించారని ఉజ్జయినికి చెందిన రాహుల్‌ శర్మ అనే ఓ పూజారి తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధిచి రాహుల్‌ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. 'ఉజ్జయిని నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో బద్‌ నగర్‌ రోడ్డులోని ఆశ్రమం నుంచి ఉదయం 9.30 గంటల సమయంలో ఆశ్రమం గేట్‌ వద్ద రక్తస్రావంతో అర్థనగంగా ఉన్న బాలికను చూశాను. విపరీతంగా రక్తస్రావమవుతున్న ఆమెకు నా బట్టలు ఇచ్చాను. ఆమె మాట్లాడలేకపోతుంది. కళ్లు వాచిపోయాయి వున్నాయి. 100కి కాల్‌ చేసినా పోలీసులు రాకపోవడంతో... స్వయంగా మహకాల్‌ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి.. ఆశ్రమం గేట్‌ వద్ద పడివున్న బాలిక పరిస్థితి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాను. అనంతరం 20 నిమిషాల్లో పోలీసులు ఆశ్రమానికి చేరుకున్నారు' అని రాహుల్‌ చెప్పారు. అత్యాచారానికి గురై... అర్థనగంగా వున్న ఆ బాలిక... స్థానికంగా ఇంటి ఇంటికి వెళ్లి సహాయం అర్థించినా... ఎవరూ సహాయం చేయలేదు. ఆ అమ్మాయి ఓ వ్యక్తిని సహాయం చేయమని దగ్గరకు వెళ్తుండగా.. అతను ఆమెను దూరంగా తరమికొట్టిన దృశ్యం సిసిటివి ఫుటేజ్‌లో కనిపించినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, ఈ ఘటన తర్వాత ఆ అమ్మాయి దగ్గరకు పోలీసులు వచ్చినా భయపడి తన వెనుకే దాక్కుందని రాహుల్‌ శర్మ చెప్పారు. మేము ఆ అమ్మాయి పేరు.. కుటుంబం.. వివరాలు ఆ బాలిక వివరాలు చెప్పినా.. తమకు అర్థం కాలేదని పూజారి రాహుల్‌శర్మ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. ప్రత్యేక పోలీసు బృందంతో దర్యాప్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మధ్యప్రదేశ్‌ హోం శాఖామంత్రి నరోత్తమ్‌ మిశ్రా బుధవారం తెలిపారు.
ఈ ఘటన జరిగి రెండురోజులైనా పోలీసులు ఒక్కరినీ కూడా అరెస్టు చేయలేదు. ఈ కేసులో అన్నికోణాల నుండి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఉజ్జయిని పోలీస్‌ చీఫ్‌ సచిన్‌ శర్మ మాట్లాడుతూ.. 'అత్యాచారానికి గురైన బాలికను తన పేరు ఏంటని? ఎక్కడ నుండి వచ్చావు అని సమాచారం తెలుసుకోవడానికి ఎన్నిసార్లు అడిగినా సమాధానమివ్వడంలేదు. ఈ అమ్మాయి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందిందని ఆమె మాట్లాడే యాసనిబట్టి తెలుస్తుంది. అయితే ఈ అమ్మాయి తప్పిపోయినట్లు ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో మిస్సింగ్‌ కేసు నమోదైంది. ఈ బాలిక ఎనిమిదోతరగతి చదువుతుందని.. తాత, అన్నయ్యలతో కలిసి ఉంటుందని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తెలిసిందని సచిన్‌ చెప్పారు. ఆ బాలిక తప్పిపోయినప్పుడు స్కూల్‌ డ్రెస్సులో ఉందని సచిన్‌ చెప్పారు. అలాగే ఈ కేసులో సిసిటివి కెమెరా ఆధారంగా వీధుల్లో బాలిక నివాసితులను సహాయమడిగినా ఎందుకు సహాయం చేయలేదని అడిగితే.. కొందరు తనకి సహాయం చేశామని చెప్పినట్లు సచిన్‌ తెలిపారు.