మోడీకి రాహుల్ సూచన
జైపూర్ : 'ప్రధాని నరేంద్ర మోడీ భారత్ మాతా కీ జై బదులు అదానీ జీ కీ జై' అని నినాదాలివ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచించారు. రాజస్థాన్‌లోని బుండీ, దౌసా జిల్లాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల సభల్లో ఆయన మాట్లాడారు. అదానీ కోసం ప్రధాని 24 గంటలూ పనిచేస్తున్నారని అన్నారు. మోడీ విధానాలు రెండు వేర్వేరు భారత దేశాలను సృష్టిస్తున్నాయని చెప్పారు. ఒకటి అదానీ ప్రయోజనాలను పరిరక్షించడం, రెండోది పేదలు, అణగారిన వర్గాలకు నష్టం చేయడం అని అన్నారు. రాజస్థాన్‌లో మళీ అధికారంలోకి రాగానే కులగణన నిర్వహిస్తామని తెలిపారు. 'రోజుకు మూడుసార్లు బట్టలు మార్చుకుంటారు. కోట్ల విలువైన విమానాలు, కార్లలో ప్రయాణిస్తారు. వెనుకబడిన తరగతుల వారి జనాభా తెలుసుకోవాలనుకున్నట్లు కులం లేదని చెబుతారు' అంటూ మోడీపై మండిపడ్డారు. జనాభాలో సగం మంది ఉన్నప్పటికీ ఇతర వెనుకబడిన తరగతులకు ఉన్నతస్థాయి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. పెద్ద పారిశ్రామిక వేత్తలు ఎవరూ లేరని చెప్పారు.
మహిళల ఖాతాల్లోకి ఏటా రూ.10 వేలు
రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపిస్తే మహిళల బ్యాంకు ఖాతాల్లో ఏటా రూ.10 వేలు బదిలీ చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ రూ.500 చొప్పున అందజేస్తామని చెప్పారు. రాజస్థాన్ అంతటా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. మోడీ రద్దు చేసిన పాత పెన్షన్ విధానాన్ని రాజస్థాన్‌లో పునరుద్ధరించిన విషయాన్ని గుర్తు చేశారు.