Nov 20,2023 11:59

చెన్నై : తమిళనాడులోని వేలూరు జిల్లాలో ఇద్దరు దళితులపై దాడికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈనెల 14న సతుమదురై రైల్వే గేటు దగ్గర ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్లడంతో కనియంబాడికి చెందిన తులసీరామన్‌ కుమారుడు దివాకర్‌ (26)ను ఇద్దరు వ్యక్తులు అసభ్యపదజాలంతో దూషించారు. వారిని అనుసరించిన దివాకర్‌ తనను తిట్టడంపై వివరణ అడిగాడు. దీంతో వారు దివాకర్‌తో వాగ్వాదానికి దిగారు. మరో ఇద్దరు మిత్రులతో కలిసి దివాకర్‌పై దాడి చేశారు. దీంతో దివాకర్‌ తలకు గాయాలయ్యాయి. గొడవను చూసిన దివాకర్‌ ఇంటి దగ్గరి వ్యక్తి శరవణన్‌ అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. యనపై కూడా బీరు సీసాలు, రాళ్లతో దాడి చేశారు. దాడిలో శరవనణ్‌ బట్టలు చిరిగిపోయాయి. అతని ఛాతీపై అంబేద్కర్‌ పచ్చబొట్టు కనిపించింది. అది చూసిన నిందితుడు.. శరవణన్‌ ఎస్సీ వర్గానికి చెందినవాడని గ్రహించి ఆగ్రహంతో ఆయనపై, దివాకర్‌పై తీవ్రంగా దాడి చేశారు. శరవణన్‌ స్పృహ కోల్పోవడంతో నలుగురు దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. చుట్టుపక్కల ప్రజలు బాధితులిద్దరినీ వేలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. బాధితులు పోలీస్‌ స్టేషన్‌లో నలుగురు వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. శరవణన్‌ తలకు 13 కుట్లు పడ్డాయి. ఆయన మాట్లాడుతూ.. ''నా ఛాతీపై పచ్చబొట్టును గమనించి వారు నాపై తీవ్రంగా దాడి చేశారు. వారు మమ్మల్ని కులం పేరుతో తిట్టారు. నేను ఇప్పుడు నడవవలేకపోతున్నాను. దివాకర్‌కి ఏడు కుట్లు పడ్డాయి'' అని తెలిపారు. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశాయి. నిందితులను ఆకాష్‌, విజరు, సతీష్‌కుమార్‌, తమిళ్‌సెల్వన్‌గా పోలీసులు గుర్తించారు. తమిళ్‌సెల్వన్‌ కోసం గాలిస్తున్నామని, ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.