Sep 18,2023 10:08
  • రెండు వారాలైనా దొరకని నిందితుల ఆచూకీ

లక్నో : బిజెపి ప్రభుత్వ పాలనలోని ఉత్తరప్రదేశ్‌లో మహిళల భద్రత అత్యంత ప్రశ్నార్థకంగా మారింది. ఒక మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌పై రైలులో దారుణంగా దాడికి పాల్పడిన ఘటన జరిగి రెండు వారాలైనా నిందితులను గుర్తించకోలేకపోవడంతో రాష్ట్రంలో, రైల్వేల్లో మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. యుపి పోలీసులు, రైల్వే పోలీసులు, యుపి స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నా ఎలాంటి పురోగతి లేదు. ఈ దాడి నుంచి బాధితురాలు ప్రాణాలతో బయటపడినా జ్ఞాపక శక్తి కోల్పోయి, ఎవరినీ గుర్తుపట్టలేని స్థితిలో ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
           పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తాన్‌పూర్‌ జిల్లాలోని ఒక పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న 47 ఏళ్ల రోష్ని (గోప్యత కోసం పేరు మార్చారు) అయోధ్యలోని హనుమాన్‌ గాడి సావన్‌ మేళాలో డ్యూటీ వేయడంతో ఆగస్టు 30న సరయూ ఎక్స్‌ప్రెస్‌లో అక్కడకి బయలుదేరారు. ఆమె అయోధ్య రైల్వే స్టేషన్‌లో దిగకుండా.. సరయూ ఎక్స్‌ప్రెస్‌ చివరి స్టాప్‌ మాన్కాపూర్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి మళ్లీ అయోధ్య వైపు బయలుదేరారు. ఈ క్రమంలోనే అంటే మాన్కాపూర్‌ - అయోధ్య స్టేషన్ల మధ్య ఆమెపై గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో దారుణంగా దాడి చేశారు. ముఖం, ఇతర శరీర భాగాలపై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి రక్తం ఓడుతూ కోచ్‌లోని బెర్త్‌ కింద అపస్మారక స్థితిలో పడిపోయారు. ఆగస్టు 30, 31 తేదీల మధ్య రాత్రి ఈ దారుణం జరిగింది. ఆమె సోదరుడి ఫిర్యాదుతో అయోధ్యలోని గవర్నమెంట్‌ రైల్వే పోలీస్‌ స్టేషన్‌, కంటోన్మెంట్‌ పోలీస్‌ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. హత్యాయత్నం, దాడి చేయడం, ఆమె దుస్తులు ధరించాలనే ఉద్దేశం వంటి అభియోగాల కింద గుర్తు తెలియని వ్యక్తులపై ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
 

                                                         సుమోటోగా స్వీకరించిన లక్నో హైకోర్టు

లక్నో హైకోర్టు ఈ కేసును ఈ నెల 3న సుమోటోగా స్వీకరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేయాలని కోర్టు తన రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ కేసును విచారించడానికి ప్రధాన న్యాయమూర్తి దివాకర్‌ ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఈ నెల 4న రాష్ట్ర డిజిపి విజరుకుమార్‌, ప్రత్యేక డిజి (శాంతి భద్రతలు) ప్రశాంత్‌ కుమార్‌ ఈ కేసును త్వరలోనే చేధిస్తామని, అసలు నిందితులను పట్టుకుంటామని ప్రకటించారు. లక్నోలోని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్శిటీలోని ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించారు. అప్పటి నుంచి విచారణ ముందుకు సాగలేదు. అనుమానితుల్ని పట్టుకుంటున్నా.. ఎవరనీ నిందితులుగా ప్రకటించలేదు. ఈ నెల 16న అంటే శనివారం నిందితుల ఆచూకీ, లేదా సమాచారం చెబితే లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తామని యుపి పోలీసులు ప్రకటించారు. తలకు గాయమైన కారణంగా బాధితురాలు దాడి వివరాలను స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇప్పటి వరకూ బాధితురాలి స్టేట్‌మెంట్‌ను ఇంకా నమోదు చేయలేదు.
బాధితురాలి స్వస్థలం ప్రయాగ్‌రాజ్‌ జిల్లా. ఆమెకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, తెలిసినవారు ఎవరైనా ఆమె దినచర్యను ట్రాక్‌చేసి ఈ దాడికి పాల్పడి ఉంటారని బాధితురాలి సోదరుడు తెలిపారు. స్పృహలోకి వచ్చిన దగ్గర నుంచి తమ ముఖాలను గుర్తు పడుతున్నా, తమ పేర్లను కూడా చెప్పలేకపోతుందని సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు.