Feb 10,2021 07:35

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌ జిల్లాలో గ్యాంగ్‌స్టర్‌ జరిపిన దాడిలో కానిస్టేబుల్‌ మృతి చెందగా..సబ్‌ ఇన్‌స్పెక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అక్రమ మద్యం దుకాణాన్ని నడుపుతున్నారన్న సమాచారం మేరకు ఓ పోలీసు బృందం మంగళవారం రాత్రి సోదాలు నిర్వహించింది. పోలీసుల బృందంపై ముఠా ఎదురు దాడి చేసి... కర్రలతో బాదడంతో..కానిస్టేబుల్‌ దేవేంద్ర, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ తీవ్రంగా గాయపడ్డారు. ముఠా తిరుగుబాటు చర్యలతో బిత్తెరపోయిన పోలీసులు..అక్కడ నుండి తప్పించుకున్నారు. పరారైన పోలీసులు గ్రామస్తుల సాయంతో నాగ్లా ధిమర్‌ గ్రామానికి చేరుకుని ప్రాణాలను దక్కించుకున్నారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ దేవేంద్ర..రక్తమోడి మరణించగా.. అశోక్‌ పరిస్థితి విషమించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. నేరాలు, నేరస్థుల పట్ల సహనంగా ఉండబోయేది లేదని, శాంతి భద్రతల విషయంలో రాజీ పడే అవకాశం లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్వీట్‌ చేసింది. గత ఏడాది జులైలో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకున్న సంగతి విదితమే. ఓ మర్డర్‌ కేసులో గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేను అరెస్టు చేసేందుకు యుపి పోలీసుల బృందం కాన్పూర్‌ జిల్లాలోని బిక్రూ గ్రామానికి వెళ్లారు. అక్కడ దూబే..ఆయన అనుచరులు ఎదురుదాడికి దిగడంతో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందారు. అనంతరం దూబే పరారవ్వగా..మధ్యప్రదేశ్‌లో పట్టుబడ్డాడు. వేరొక ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో పోలీసు కస్టడీ నుండి పారిపోతుండగా..పోలీసులు కాల్చి చంపిన సంగతి విదితమే.