లక్నో : బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ (ఎబివిపి)కు చెందిన గూండాలు ఉత్తరప్రదేశ్‌లో ఒక జైన్ కాలేజ్‌పై దాడికి దిగారు. సామాగ్రిని, ఆస్తులను ధ్వంసం చేశారు. కళాశాల ఆవరణలో ఉన్న జైన దేవత గుడిని, అందులోని విగ్రహాన్ని కూల్చివేస్తామని బెదిరించారు. చెప్పులతో విగ్రహంపైకి ఎక్కారు. బఘపత్ జిల్లాలోని బారౌత్ నగరంలోని దిగంబర్ జైన్ కాలేజ్‌లో ఈ ఘటన జరిగింది. సుమారు 30 ఉన్న ఎబివిపి గూండాల గుంపు కాలేజ్‌లోకి చొరబడి దౌర్జన్యానికి దిగింది. వారంతా కాషాయ వస్త్రాలు ధరించివున్నారు. కాలేజ్‌లో ఉన్న జైనుల దేవత మాశ్రుత్ దేవి గుడిని, విగ్రహాన్ని కూల్చవేయడానికి ప్రయత్నించారు. విగ్రహాన్ని, గుడిని అక్కడ నుంచి వారం రోజుల్లో తొలగించాలని, లేకపోతే తామే కూల్చివేస్తామని కళాశాల అధికారుల్ని బెదిరించారు. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ వీరేంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుడి ముందు అభ్యంతరకరమైన భాష ఉయోగిస్తూ నినాదాలు చేశారని ప్రిన్సిపల్ ఆరోపించారు.










