
- ఉన్నతాధికార్లు, కంపెనీల ప్రతినిధులతో వర్కింగు గ్రూపు
- జులై 15 నాటికి నివేదిక: జీవో జారీ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు, గ్లోబల్ కంపెనీల ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎఐ, ఎల్‌ఎల్‌ఎం, ఛాట్‌జిపిటి, వెబ్ 3.0 తరహా భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానంతో సుశిక్షితులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కమిటీ వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీకి పాఠశాల మౌలిక సదుపాయాల కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఐటి సెక్రటరీ, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, ఎస్‌ఎస్‌ఏ డైరెక్టర్, ఎస్‌ఇఆర్‌టి డైరెక్టర్, మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రతినిధి అశుతోష్ చద్దా సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు అమెజాన్ వెబ్ సర్వీసుకు చెందిన షాలినీ కపూర్, గూగుల్ ప్రతినిధి, ఇంటెల్ ఆసియా ప్రతినిధి, నాస్కాం ప్రతినిధి, సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ పాలసీ రీసెర్చ్ అధ్యక్షులు బైజిత్ భట్టాచార్య, నీతిఅయోగ్ డిసి మాజీ సలహాదారు అర్చనా గులాటీ తదితరులు సభ్యులుగా ఉంటారు. అధునాతన విద్యపై తీసుకోవాల్సిన అంశాలపై ఈ కమిటీ చర్చించి జులై 15వ తేదీ నాటికి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని, దాని ఆధారంగా డిజిటల్ విద్యా విధానాన్ని రూపొందించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
ఉన్నత విద్యారంగంలో నయా ఉదారవాద విధానాలను ప్రవేశపెట్టడానికి, అందులో బహుళజాతి కంపెనీలకు పెద్ద పీట వేయడానికే ఈ కమిటీ ఏర్పాటని విశ్లేషకులు అంటున్నారు. పాఠశాల విద్యలో బైజూస్ చేతికి తాళాలప్పగించిన సర్కారు ఉన్నత విద్యారంగంలో ఏదో ఒక సంస్థకా లేక కొన్ని కంపెనీలకు అప్పగిస్తుందా అన్నది త్వరలోనే తెలుస్తుందని వారంటున్నారు. కేవలం నెల రోజుల్లోనే ఇంత కీలకమైన విషయంపై నివేదిక ఇవ్వాలని గడువు పెట్టారంటే ఆ విధానమేమిటో ప్రాథమికంగా నిర్ణయించినట్టుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భవిష్యత్ టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నైపుణ్యాలతో ప్రభుత్వ విద్యార్థులు హైఎండ్ టెక్నాలజీలో ఉన్నత ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ఈ కమిటీ చర్చించి తయారు చేసే నివేదిక ఆధారంగా పాఠ్యప్రణాళిక, మానవ వనరులు, సదుపాయాలపై ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్‌ను తీసుకొచ్చిన ప్రభుత్వం రెండు భాషలతో పుస్తకాలను ముద్రించి సరఫరా చేసింది. 5,18,740 మంది విద్యార్థులకు ట్యాబులు కూడా అందించడంతోపాటు బైజూస్ కంటెంట్‌ను ఏర్పాటు చేసింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను తీసుకొచ్చింది. 30213 తరగతి గదుల్లో స్మార్ట్ టివిలను ఏర్పాటు చేసింది. ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్స్‌నూ పెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, లార్డ్ లాంగ్వేజ్ మోడల్, డేటా అనలటిక్స్, ఛాట్ జిపిటి, ఆగ్‌మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డిజిటల్ కరెన్సీ తదితర అంశాలపై విద్యార్థులకు నైపుణ్యం ఇచ్చే అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను మార్పులను గుర్తించేందుకు ఈ వర్కింగు గ్రూపు ప్రణాళిక రూపొందించనుంది.