
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాల విద్యాశాఖ కార్యాలయం గుంటూరు జిల్లా మంగళగిరి వద్దకు రానుంది. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలోని ఆంజనేయ టవర్స్‌లో ప్రస్తుతం ఈ కార్యాలయం తన విధులను నిర్వహిస్తోంది. ఇబ్రహీంపట్నం నుంచి మంగళగిరిలో ఉన్న వెంకట్రాది టవర్స్‌కు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జిఓ విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఈ మేరకు జిఓ 266ను విడుదల చేశారు. పాఠశాల విద్యాశాఖతో పాటు ఆంజనేయ టవర్స్‌లోనే ఉన్న ఎపి మోడల్ స్కూల్ సొసైటీ, వయోజన విద్య, విజయవాడలోని కృష్ణలంకలో ఉన్న జవహర్ బాల భవన్, గుంటూరులో ఉన్న ఎపిఆర్‌ఇఐ సొసైటీ, మంగళగిరిలోనే ఉన్న గ్రంథాలయ సంస్థ కార్యాలయాలు వెంకట్రాది టవర్స్‌కు తరలి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. 40 వేల చదరపు అడుగులను ఒక్కో చదరపు అడుగుకు రూ.20, అదనపు సౌకర్యాలు కోసం అదనంగా మరో రూ.5గా పేర్కొంది. మొత్తంగా చదరపు అడుగుకు రూ.25 అద్దెగా ప్రభుత్వం వెల్లడించింది.