
ప్రపంచ బాలల స్థితిగతుల గురించి, వారి జీవితాలను మెరుగు పరిచే ప్రక్రియ గురించి ఆలోచించే ఏకైక అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి (యుఎన్‌ఓ) అనుబంధ సంస్థ యునిసెఫ్. ఆకలి, దారిద్య్రం, అనారోగ్యంతో బాధపడుతున్న బాలలు అన్ని దేశాల్లో ఉన్నారు. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో ప్రతి దేశంలో ఉన్నారు. ఆకలి, దారిద్య్రంతో పాటు వెట్టిచాకిరి కూడా బాల్యాన్ని బాధ పెడుతూనే ఉంది. ఆ విధంగా ఇవి బాలల హక్కుల్ని హరిస్తున్నాయి. అయితే యుఎన్‌ఓ చొరవతో వివిధ దేశాలు బాలలు స్థితిగతుల గురించి సందర్భాన్ని బట్టి ఆలోచిస్తున్నాయి, స్పందిస్తున్నాయి కూడా. జూన్ 1వ తేదీన 'అంతర్జాతీయ బాలల దినోత్సవం' నిర్వహించాలని గుర్తించడం ద్వారా బాలల భవితకు భరోసా ఇచ్చిందని చెప్పవచ్చు.
1948వ సంత్సరంలో జరిగిన ''ప్రపంచ మహిళా సమాఖ్య'' అంతర్జాతీయ సమావేశంలో ప్రతి సంవత్సరం జూన్ ఒకటవ తేదీన ''అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. ఈ తీర్మానంపై సుమారు వందకు పైగా దేశాలు సంతకం చేశాయి. అప్పటి నుండి ఆరోజున ''అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని'' నిర్వహిస్తున్నారు. 1989 సంవత్సరంలో అంటే సుమారు 41 సంవత్సరాల తరువాత యుఎన్‌ఓ సమక్షంలో సభ్య దేశాలు (భారత్ కూడా) బాలలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటామనే భరోసాతో కూడిన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
ఈ ఒప్పందం ప్రకారం ఆయా దేశాల ప్రభుత్వాలు, బాలలను అన్ని విధాలా ఆదుకోవాలి. ముఖ్యంగా పౌష్టికాహారం, విద్య, బట్టలు, నిత్యావసరాలను ఆయా దేశాల ప్రభుత్వాలు తప్పనిసరిగా కల్పించాలి. అయితే సంపన్న దేశాలు కూడా కేవలం బాలల్లో ముప్పాతిక శాతానికి మాత్రమే తిండి, బట్ట కల్పించగలుగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలు ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాలు, భారతదేశం బాలల్ని దారిద్య్రం, ఆకలి భాదల నుంచి విముక్తి కల్గించ లేకపోతున్నాయి.
ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో 80 శాతం బాలలు కటిక దారిద్య్రంలో మగ్గుతున్నారు. యునిసెఫ్ నివేదిక ప్రకారం 1993 సంవత్సరంలో ప్రతి 1000 జననాల్లో 122 మంది బాల్యదశ దాటకుండానే మృతి చెందుతున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావం బాలల భవిష్యత్తుపై పడింది. వీరు గృహ హింసకు, బాల్య వివాహాలకు, అవమానాలకు గురయ్యారు. కొన్ని కోట్ల మంది బాలలు చదువు కొనసాగించడం ప్రశ్నార్ధకంగా మారింది. బాలలు శారీరక, మానసిక సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యం ఉంది. వలస కార్మికుల కుటుంబాలలో బాలల కష్టాలు వర్ణనాతీతం.
అలాగే ప్రపంచ ఆరోగ్య నివేదిక ప్రకారం రెండున్నర కోట్ల మంది బిడ్డలు పుడితే వారిలో సుమారు 13 లక్షల మంది 28 రోజుల్లోనే చనిపోతున్నారు. ఈ పరిణామాలు ఆందోళన కల్గించే విషయాలే. బాలల అభ్యున్నతి, దేశాభివృద్ధి చదువుతో ముడిపడి ఉంది. ఇది గమనించిన యుఎన్‌ఓ సభ్య దేశాలు బాలలకు చదువును ఉచితంగా అందిస్తామనే తీర్మానాలు చేశాయి. వాగ్దానంతో కూడిన భరోసా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే...మన దేశంలో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం-2009 సాధ్యమయింది. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో త్రికరణశుద్ధిగా అమలు చేసినప్పుడే నిజమైన ''అంతర్జాతీయ బాలల దినోత్సవం'' ఫలితాలు అందినట్లవుతుంది. అప్పుడే యుఎన్‌ఓకి భారతదేశం చేసిన వాగ్దానం అమలు అయినట్టు. ఆ దిశగా భారతదేశం ప్రయత్నాలు కొనసాగిస్తుందని ఆశిద్దాం.
- నరవ ప్రకాశరావు,
బాల వికాస్ ఫౌండేషన్ గౌరవ కార్యదర్శి-విశాఖపట్నం, సెల్ : 932477463