గత ఇరవై ఏళ్లుగా (పదిహేను నెలలు మినహా) బిజెపి పాలనలో వున్న మధ్యప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు నిరుద్యోగం, అధిక ధరలు. రాష్ట్ర జనాభాలో మూడింట ఒక వంతు మంది పేదలు. అంతకుముందు మధ్యప్రదేశ్ భారీ పారిశ్రామిక నగరాలకు ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఐటీతో సహా కొత్త తరహా పరిశ్రమల విషయంలో మధ్యప్రదేశ్ చాలా వెనుకబడి ఉంది. అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో మధ్యప్రదేశ్ చాలా అధ్వాన స్థితిలో ఉందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు సైతం ధృవీకరిస్తున్నాయి. వ్యవసాయ రంగంలోనూ సంక్షోభం తీవ్రంగా ఉంది. ఈ విషయాన్ని బిజెపి అనుకూల మీడియా కూడా దాచలేకపోతోంది.
వీటన్నింటికీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను బాధ్యులను చేసి... ప్రధాని నరేంద్ర మోడీని రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సారథిగా కొనసాగించేందుకు బిజెపి మొదట ప్రయత్నించింది. ఎన్నికల ప్రకటనకు ముందు నిర్వహించిన ర్యాలీల్లో చౌహాన్ పేరు ప్రస్తావించకుండా బిజెపి తప్పించుకుంది. ముగ్గురు కేంద్ర మంత్రులు, నలుగురు ఎంపీలు అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులుగా నిలిచారు. కానీ ప్రచారం ఊపందుకునే కొద్దీ...రాష్ట్రంలోని బిజెపి నాయకులలో సాపేక్షంగా ఎక్కువ ప్రజాదరణ పొందిన చౌహాన్‌ను పక్కన పెట్టడం వల్ల...తమకు నష్టం కలుగుతుందని బిజెపి గ్రహించింది. అప్పుడు చౌహాన్‌ను కూడా తెరపైకి తేకతప్పలేదు. ఎప్పటిలాగే, ప్రజా సమస్యలపై ఇప్పటికే ఉన్న అసంతృప్తిని అధిగమించడానికి బిజెపి హిందూత్వ ప్రచారంపై ఆధారపడుతున్నది. రామ మందిర నిర్మాణాన్ని, ముస్లిం వ్యతిరేక వైఖరులను విజయాలుగా చూపేందుకు వెనుకాడదు. మధ్యప్రదేశ్‌లో మరోసారి బిజెపి గెలిస్తే అయోధ్య లోని రామమందిరానికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని హోంమంత్రి అమిత్ షా ఇటీవల జరిగిన ప్రచార సభలో ప్రకటించారు. ఈ ఏడాది మధ్యప్రదేశ్‌లో మూడు దీపావళి వేడుకలు నిర్వహిస్తామని అమిత్ షా రెండు రోజుల క్రితం చెప్పారు. మొదటిది సంప్రదాయ దీపావళి. రెండోది ఎన్నికల ఫలితాలు వెలువడే డిసెంబర్ 3న, మూడోది జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో విగ్రహ ప్రతిష్ట నిర్వహించినప్పుడని షా చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా రామమందిర నిర్మాణం పేరు చెప్పి ఓట్లు అడిగారు.
ఎన్నికల ప్రచార బృందంలో బిజెపి జాతీయ నాయకత్వంలోని సాధారణ ఆఫీస్ బేరర్లతోపాటు కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ యాదవ్ మధ్యప్రదేశ్‌లో మకాం వేసి పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తే, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ, లోక్‌సభ సభ్యులు రాకేష్ సింగ్, గణేష్ సింగ్, రితీ పాఠక్, ఉదరు ప్రతాప్ సింగ్ బిజెపి అభ్యర్థులుగా ఉన్నారు. సుదీర్ఘ అనిశ్చితి తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ తన నియోజకవర్గమైన బుధ్ని నుండి పోటీ చేస్తున్నట్టు వెల్లడైంది.
బిజెపి పాలనకు వ్యతిరేకంగా ప్రజా సెంటిమెంట్ బలంతో 2018 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, 2020 మార్చి లోనే నిష్క్రమించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్న కమల్‌నాథ్‌పై కాంగ్రెస్ హైకమాండ్ అధిక వాత్సల్యం చూపిస్తోందంటూ జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆయనతోపాటు ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు బిజెపిలో చేరారు. సింధియాకు ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి లభించినప్పటికీ మధ్యప్రదేశ్‌లో చెప్పుకోదగ్గ పాత్ర లేదు. సింధియాతో కలిసి బిజెపిలో చేరిన వారిలో చాలా మంది తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కమల్‌నాథ్, మరో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజరు సింగ్‌ల మధ్య పోరు ప్రస్తుతం కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. వీరిద్దరి మధ్య వైరం ఎంత లోతుగా ఉందో తెలియజేసే వీడియోను బిజెపి వాడుకుంది. బిజెపి ప్రచారాన్ని ప్రారంభించిన తర్వాత కమల్‌నాథ్, దిగ్విజరు సింగ్‌లు ఏక్‌తా సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
బిజెపి హిందుత్వ ఎజెండాను ఎదుర్కోవడానికి కమలనాథ్ కూడా అదే అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. రామ విగ్రహారాధన కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వం బాబ్రీ మసీదు గేట్లను తెరిచినందుకు ఓట్లు అడగాలని కమల్‌నాథ్ నిర్ణయించారు. తాను కూడా హనుమంతుడి భక్తుడినేనని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. భోపాల్‌లోని హుసూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిని బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ కార్యకర్తలు కమల్‌నాథ్ నివాసం ముందు హనుమాన్ పూజ కూడా చేశారు.
మహిళలకు ప్రతి నెలా బ్యాంకు ఖాతాల్లో రూ.1500 వేస్తామని, రైతు రుణమాఫీ చేస్తామని, 100 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని...కాంగ్రెస్ పలు వాగ్దానాలు చేస్తున్నది. జాతీయ స్థాయిలో కుల గణనను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ మధ్యప్రదేశ్ విషయంలో మాత్రం మౌనంగా ఉంది. రాష్ట్రంలో ఓబీసీ సమస్యను చేపట్టడం వల్ల కాంగ్రెస్‌కు రాజకీయ లబ్ధి చేకూరదని నేతలు భావిస్తున్నారు. 'ఇండియా' వేదిక లోని ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. 2018లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకున్నప్పటికీ 40.89 శాతం ఓట్లు మాత్రమే పొందింది. బిజెపి 109 స్థానాల్లో గెలిచి 41.02 శాతం ఓట్లు సాధించింది. అప్పట్లో ఎస్‌పి, బిఎస్‌పి ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది.
కమల్‌నాథ్ 'చింద్వారా' సిట్టింగ్ స్థానానికి తిరిగి ఎన్నిక కావాలని కోరుకుంటున్నారు. దిగ్విజరు సింగ్ కుమారుడు జైవర్ధన్ సింగ్ 'రఘోగఢ్'లో అభ్యర్థిగా వున్నారు. ఆయన సోదరుడు లక్ష్మణ్ సింగ్ 'చచౌరా' స్థానంలో పోటీకి నిలిచారు. ఇండోర్-వన్ నియోజకవర్గంలో కైలాష్ విజయ వర్గియాపై కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సంజరు శుక్లా బరిలోకి దిగారు. సిపిఎం నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 230 నియోజకవర్గాల్లోను ఈ నెల 17వ తేదీన ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. బిజెపి కి కాస్త ఎదురుదెబ్బ తగులుతుందని ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
- సజన్ ఎవ్జిన్ ( 'దేశాభిమాని' సౌజన్యంతో )