సాయంత్రం 5 .00 గంటలకు మధ్యప్రదేశ్‌లో 71 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 67 శాతం
భోపాల్ /రాయ్‌పూర్ : మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో పోలింగ్ ముగింపు దశకు చేరుకుంది. మధ్యప్రదేశ్‌లో సాయంత్రం ఐదు గంటల సమయానికి 71 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఛత్తీస్‌గఢ్‌లో 67 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ (ఈసి) తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని 230 నియోజకవర్గాలకు ఒకేదశలో ఓటింగ్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్థానాలకు గాను 20 స్థానాలకు నవంబర్ 7న తొలివిడత ఓటింగ్ జరగగా, మిగిలిన 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ నిర్వహించింది.
మధ్యాహ్నం 3.00 గంటలకు నమోదైన పోలింగ్
భోపాల్ / రాయ్‌పూర్ : మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఓటింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3.00 గంటల సమయానికి మధ్యప్రదేశ్‌లో 60.52 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ (ఈసి) తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో 55.31 శాతం ఓటింగ్ నమోదైంది.
మధ్యప్రదేశ్‌లోని మెహాగాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ కొనసాగుతుండగా గుర్తు తెలియని దుండగులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో బిజెపి అభ్యర్థి, ఆప్ మద్దతుదారునికి స్పల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార బిజెపి లిక్కర్, నగదు పంపిణీ చేస్తోందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ పేర్కొన్నారు.
మధ్యాహ్నం 1.00 గంట సమయానికి నమోదైన పోలింగ్
భోపాల్ / రాయ్‌పూర్ : మధ్యప్రదేశ్‌లో, ఛత్తీస్‌గఢ్‌లలో పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1.00 గంట సమయానికి 45.4 శాతం నమోదైనట్లు ఎన్నికల కమిషన్ (ఈసి) ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్ లో 1.00 గంట సమయానికి 37.87 శాతం నమోదైనట్లు తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని 70 అసెంబ్లీ స్థానాలకు గాను రెండోదశ పోలింగ్ నేడు జరుగుతోంది. మధ్యాహ్నం సమయానికి సారన్‌గార్గ్- బిలాయ్‌ఘర్‌లోని కొత్త జిల్లా సారన్ గార్గ్‌లో అత్యధికంగా 46.2 శాతం ఓటింగ్ నమోదవగా, బిలాస్‌పూర్‌లోని బెల్టారాలో అత్యల్పంగా 23.12 శాతం ఓటింగ్ జరిగింది.
11 గంటలకు మధ్యప్రదేశ్‌లో 27.79 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 19.65 శాతం ఓటింగ్
భోపాల్ / రాయ్‌పూర్ : మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి మధ్యప్రదేశ్‌లో 27.79 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ (ఈసి) ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 230 నియోజకవర్గాలకు ఒకేదశలో పోలింగ్ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో 11గంటల సమయానికి 19.65 శాతం నమోదైనట్లు ఈసి వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లోని 90 నియోజకవర్గాలకు గాను 20 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 7న మొదటి విడత ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మిగిలిన 70 అసెంబ్లీ నియోజక వర్గాలకు నేడు రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది.
కొనసాగుతున్న ఓటింగ్ .. 9గంటలకు మధ్యప్రదేశ్‌లో 10.4 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 5.4 శాతం
భోపాల్ / రాయ్‌పూర్ : మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో పోలింగ్ కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల సమయానికి మధ్యప్రదేశ్‌లో 10.4 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఛత్తీస్‌గఢ్‌లో 5.4 శాతం నమోదైంది.
మధ్యప్రదేశ్‌లోని దిమాని నియోజకవర్గంలో రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడినట్లు అధికారులు తెలిపారు. మిర్ఘన్ గ్రామంలో కాల్పుల జరిగినట్లు ఫిర్యాదు వచ్చిందని, అయితే ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొందని డిఎస్‌పి విజయ్ సింగ్ భడోరియా తెలిపారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, ఆయన భార్య సాధనాసింగ్, ఇద్దరు కుమారులు సెహోర్‌లో ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో శివరాజ్ సింగ్ చౌహన్ బుద్నీ నుండి బరిలో దిగారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సిఎం కమల్ నాథ్ ఛింద్వాఢాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన కుమారుడు, ఎంపి నకుల్ నాథ్ శిఖర్‌పూర్‌లో ఓటు వేశారు. కేంద్రమంత్రులు ప్రహ్లాద్ సింగ్ పటేల్, వీరేంద్ర కుమార్, అలాగే మధ్యప్రదేశ్ మంత్రులు నరోత్తమ్ మిశ్రా, యశోధరా రాజే సింధియా, రాజ్యవర్ధన్ సింగ్ దట్టిగావ్, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కుమారుడు జైవర్ధన్ సింగ్‌లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. మొదటి విడతలో భాగంగా నవంబరు 7న 20 స్థానాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. రెండో దశ ఎన్నికల్లో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, ఆయన డిప్యూటీ టి.ఎన్.సింగ్ డియో, ఎనిమిది మంది రాష్ట్ర మంత్రులు, నలుగురు ఎంపిలు పోటీ పడుతున్నారు. ఈ రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు తెలంగాణ, రాజస్తాన్, మిజోరాంలతో పాటు డిసెంబర్ 3న జరగనుంది.