అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నేపథ్యంలో వీస్తున్న ఎదురు గాలిని తట్టుకోవడానికి బిజెపి అగ్ర నాయకత్వం, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా వేస్తున్న ఎత్తులు పైఎత్తులు అభాసుపాలవుతున్నాయి. ఆర్భాటంగా ప్రకటించిన తతంగాలు చాప చుట్టుకోవలసి వస్తున్నది. ప్రతిపక్షాల నుంచే గాక రాజ్యాంగ నిపుణుల నుంచి, మీడియా నుంచి విమర్శలు రావడంతో అనివార్యంగా వెనక్కు తగ్గవలసి వస్తున్నది. జమిలి ఎన్నికల నినాదం ఆ ఎత్తుగడలకు పరాకాష్టగానే రూపు దిద్దుకుంది. డబుల్ ఇంజన్ హడావుడి కూడా అదే. కేంద్రంలోని మోడీనే రాష్ట్రాలలో ఊరేగించి ఒకేసారి రాష్ట్రాలనూ కైవశం చేసుకోవచ్చనే అప్రజాస్వామిక ఆలోచన దీని వెనక వుందని అందరికీ అర్థమైపోయింది. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే పన్ను, ఒకే మతం, ఒకే పార్టీ, ఒకే రేషన్, ఒకే మతం... అన్న చందంగా చేసే రాజకీయమే దేశభక్తిగా చలామణి చేయడం ఎంతో కాలం చెల్లదని ఒప్పుకోవలసి వచ్చింది. జమిలి ఎన్నికలను రుద్దడం తేలిక కాదనీ పైగా ఈ సమయంలో వ్యతిరేకత కూడా తెచ్చిపెట్టవచ్చని గ్రహించిన తర్వాత ప్రస్తుతానికి కేంద్రం వెనక్కు తగ్గింది. అయితే మరోవైపున ఇందుకోసమే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన అధ్యయన కమిటీ నియమితమైంది. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకుండానే కేవలం మోడీ కనుసన్నలలో పూర్తయిన కొత్త పార్లమెంటు భవనంలో దీన్ని ఆమోదించడం ఆసక్తికరం. మోడీ విధేయత కారణంగా గతంలో రాష్ట్రపతి పదవి పొందిన కోవింద్‌నే మళ్లీ తెరపైకి తేవడం యాదృచ్ఛికం కాదు. వాస్తవానికి పదవీ విమరణ చేసిన ఒక రాష్ట్రపతికి అధికారిక బాధ్యత అప్పగించడం ఇదే ప్రథమం. కేంద్ర ప్రభుత్వ అధికారులను కమల ప్రచారకులుగా వాడుకోవడం కోసం ఉద్దేశించిన 'రథ్ ప్రభారీ' ప్రహసనం ఆ విధంగానే విమర్శల పాలైంది. కేంద్ర పథకాల ప్రచారమంటూ అధికారులను స్వంత పార్టీ సైన్యంగా మార్చేసుకుని ఆ ముసుగులోనే పార్టీ ప్రచారం చేయించుకోవడానికి పెట్టుకున్న 'రథ్ ప్రభారీ' పేరును చల్లగా మార్చుకోవలసి వచ్చింది. ఎన్నికల కమిషన్ నోటీసుతో ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాలలోనూ ఈ కార్యక్రమం వుండబోదనే ప్రకటనా చేయవలసి వచ్చింది. అయితే ప్రధాని దీన్ని ప్రారంభించడం, దేశ వ్యాపితంగా ఈ ప్రచార ప్రహసనం యథా విధంగా కొనసాగుతుంది. అంటే మౌలికంగా మోడీ ఆలోచనా ధోరణిలో గానీ రాజ్యాంగ వ్యతిరేక రాజకీయాలలోగానీ మార్పు లేదని స్పష్టమవుతుంది.
- రాముడి ఆశీస్సులు ఆయనకేనా?
అయిదు రాష్ట్రాల ఎన్నికలలో బలాబలాలను బట్టి, రాజకీయ వాతావరణాన్ని బట్టి చూస్తే బిజెపికి పెద్ద అనుకూలత లేదని చాలా చోట్ల ఓడిపోవచ్చనీ సర్వేలు చెబుతున్నాయి. మూడు హిందీ రాష్ట్రాలలో పాతవారిని కొనసాగించలేని, ప్రస్తుతమున్న వారిని కొనసాగించలేని స్థితిలో బిజెపి వుంది. ఈ సంకట స్థితిని అధిగమించడానికి రామభక్తి నుంచి రాజకీయ కుయుక్తుల వరకూ దేనికీ వెనకాడటం లేదు. అయోధ్య పరిణామాలు, సుప్రీంకోర్టు తీర్పు...తదితర అంశాలు మళ్లీ ముందుకొచ్చాయి. 2019 ఎన్నికలు ముగియగానే అయోధ్యలో భూమి పూజలో ప్రధాని మోడీ ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు కూడా అయోధ్య ట్రస్టు ప్రతినిధులు మోడీని కలిసి 2024 జనవరిలో విగ్రహ మహా ప్రతిష్టాపనకు హాజరు కావలసిందిగా ఆహ్వానం అందించారు. ఆయన దాన్ని మీడియాలో పెద్ద విషయంగానే ప్రచారంలో పెట్టారు. బిజెపి మిత్రపక్షంగా దీర్ఘకాలం కొనసాగడమే గాక అయోధ్య ఘటనలలోనూ ఆరోపణలకు గురైన మహారాష్ట్ర శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం ఎం.పి సంజరు రౌత్ దీనిపై స్పందిస్తూ 'రాముడు బిజెపికి, మోడీకి మాత్రమే సంబంధించిన దేవుడు కాదు కదా...' అని ఆక్షేపించారు. అయోధ్య ఆలయం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌కు ఇది చాలా కోపం తెప్పించింది. ప్రధా ని గనక పిలిచా మంటే అదోరకంగా వుండేది. మోడీకి రాముడి ఆశీస్సులున్నాయి గనకే దేశాధినేతగా అధికారం చలాయించగలుగుతున్నారని, మిగిలిన వాళ్లు వీధుల్లో తిరుగుతున్నారని ఫక్తు రాజకీయ వాదన చేశారు. మరో విధంగా చెప్పాలంటే రాముడి ఆశీస్సులు ఆయనకే వున్నాయని కితాబిచ్చారన్నమాట. అయోధ్యలో భూ మాఫియా పెరిగి కబ్జాలు, దౌర్జన్యాలు చేస్తున్నారనే వార్తలు వస్తుంటే, ఒక పూజారి కూడా వారి చేతుల్లో ఈ మధ్యనే హత్యకు గురైతే ఇంతవరకు అతీగతీ లేదు. ఈ సమయంలోనే వారణాసిలో జ్ఞానవాపి మసీదు, బృందావన్ లో కృష్ణమందిరం సమస్యలను కోర్టుల్లో తిరిగి తీసుకురావడం కూడా ఈ మత రాజకీయంలో భాగమే. ఢిల్లీలో రామ్‌లీలా మైదానంలో రావణ దహనంలో పాల్గొంటూ మోడీ పరోక్షంగా ఎవరైతే కుల గణన పేరిట ప్రజల్లో చీలికలు తెస్తున్నారో వారిని కూడా ఇలాగే దహనం చేయాలని తీవ్రమైన మాటన్నారు. 'ఇండియా' వేదికను దృష్టిలో పెట్టుకునే ప్రధాని ఇంత మాటన్నారని మీడియా పోల్చి రాసింది.
- మార్క్సిస్టులపై దాడి, నచ్చిందే చరిత్ర!
ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ సంప్రదాయికంగా చేసే దసరా ప్రసంగంలో ఇంచుమించు ఇదే సెలవిచ్చారు. సాంస్కృతిక మార్క్సిస్టులను, వోక్ పీపుల్ (మేల్కొల్పు జనాభా)ను తోసిపుచ్చాలని భగవత్ ఉవాచ. కొన్నేళ్ల కిందట మోడీ లోక్‌సభలో ఆందోళన జీవులంటూ అపహాస్యం చేయడం గుర్తుండే వుంటుంది. ఈ మాటలన్నీ కూడా చైతన్యం, కదలిక తీసుకొచ్చే వారిపైన ఎక్కుపెట్టబడిన ఆయుధాలే. పశ్చిమ దేశాల్లో విముక్తి కోసం పోరాడేవారిని వోక్ పీపుల్ అంటుంటారట. దేశంలో సమస్త అనర్థాలకూ వారే మూల కారణమని మోహన్ భగవత్ ప్రకటించారు. వీరు ప్రజల్లో అసంతృప్తి పెంచుతారట, చీలికలు తెస్తారట, ఆఖరుకు మణిపూర్‌లో కూడా వీరి వల్లనే కుకీ, మైతేయిల మధ్య తగాదా వచ్చిందట. ఈ దేశంలో వున్నవారంతా హిందువులేనని ప్రకటించిన సర్ సంఫ్‌ుచాలక్ నోట ఈ మాటలు రావడం దేనికి నిదర్శనం? సనాతన ధర్మమే శరణ్యమనే సంఘపరివార్ భావమే అది. అల్ప సంఖ్యాకులు, అణగారిన వర్గాలు, మహిళలు నోరు మూసుకుని పడుంటే ఏ గొడవలు రావని తాత్పర్యం. రాజ్యాంగం మొదటి అధికరణమే చెబుతున్నట్టు 'ఇండియా దటీజ్ భారత్'గా గాక ఈ దేశాన్ని భారత్ అనే పిలవాలని తీర్మానించడం కూడా ఈ మహా పథకంలో భాగం. ఇండియా పేరుతో పాటు దాని చరిత్రనూ మార్చడం దాని కార్యాచరణ రూపం. జరిగిన చరిత్రను మరింత శాస్త్రీయంగా ప్రామాణికంగా పరిశోధించి భావితరాలకు అందించడం గాక హిందూ రాజులను కీర్తించే విధంగా చరిత్ర పాఠాలుండాలని, మొఘల్ చరిత్ర తీసేయాలనీ ఎన్‌సిఇఆర్‌టి చెప్పడమూ అందుకే. అంతేనా? చరిత్రకూ పురాణాలకూ మధ్య తేడా చెరిపెయ్యాలి. చంద్రయాన్ పాఠంతో పాటు ప్రాచీన కాలంలోనే మనవాళ్లు ఆకాశ విహారం చేశారనీ పుష్పక విమానం వుండేదనీ చెప్పాలని ఎన్‌సిఇఆర్‌టి ఆదేశం. ఇదే సమయంలో నిజమైన చరిత్రలో అవసరమైన అంశాలు తెలియకుండా చేయడం కోసం గాంధీజీ హత్య, గుజరాత్ మత హత్యాకాండ వంటివి తీసేయాలి. ఇవి అమలులోకి రావడం తర్వాత జరిగినా ముందు ఈ వార్తలు విడుదల చేయడం ద్వారా మత చాందసాలను సంతృప్తి పరచాలి. అయితే విద్యారంగం ఉమ్మడి జాబితాలో వుంది గనక, పాఠ్యాంశాల పరంగా నిర్ణయాలు రాష్ట్రాలు తీసుకుంటాయి గనక కొత్త విధానం వాటిపై రుద్దడం జరుగుతున్నది. కేరళ, తమిళనాడు, బెంగాల్ వంటి రాష్ట్రాలు ఇందుకు గట్టిగా నిరాకరించినా ఎ.పి తో సహా పలు రాష్ట్రాలు అత్యుత్సాహంగా అమలు చేయడం ఆందోళన కలిగించే వాస్తవం. సహకార రంగం తమ అదుపులోకి తెచ్చుకోవడానికి అడుగులు వేస్తున్నారు. పర్యాటక రంగం కూడా తమ అధీనంలోకి తీసుకుంటున్నారు.
- రాష్ట్రాలపై ఆర్థిక బిగింపు
ఈ ఏకపక్ష కేంద్రీకృత, రాజకీయ సాంస్కృతిక ఆధిపత్య దోరణిని చలాయించడం కోసం మరింత వేగంగా ఆర్థిక కేంద్రీకరణ తీసుకొస్తున్నారు. పరిమిత అధికారాలు గల ఢిల్లీ రాష్ట్ర నమూనా ఇందుకు ఆదర్శంగా కనిపిస్తున్నది. సుప్రీంకోర్టులోనే ఇందుకు వ్యతిరేకంగా తీర్పు రాగా రాజ్యాంగ సవరణతో తోసిపుచ్చి సర్వాధికారాలు చేజిక్కించుకుంది కేంద్రం. ఉప ముఖ్యమంత్రితో సహా ఆ రాష్ట్ర నేతలను ఖైదు చేసి అడుగడుగునా ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డు తగులుతున్నది. జమ్మూ కాశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడంలో మతతత్వ రాజకీయమూ కేంద్ర పెత్తనమూ రెండూ వున్నాయి. అసలు స్వాతంత్య్రానంతరం ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం ఇదే ప్రథమం. రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేయకుండా పరాధీనతలోకి నెట్టడం, నిధులు కేటాయించకపోవడం నిరంతర ప్రహసనంగా మారింది. ఎ.పి, తెలంగాణల అనుభవమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. కేరళ నిరంతరం దీనిపై పోరాడుతూనే వుంది. నిధులు ఇవ్వకపోవ డం, తెచ్చుకునే అప్పులపై ఆంక్షలు పెట్టడం రాష్ట్రాలను అడకత్తెరలోకి నెడుతున్నది. అప్పులు పెరిగాయని మళ్లీ ఆ బిజెపి నేతలే గగ్గోలు మొదలెడతారు. రాష్ట్రాల వాటా తేల్చే ఫైనాన్స్ కమిషన్ పరిధినే తగ్గించడంతో పాటు చేసిన సిఫార్సులనూ కేంద్రం తొక్కిపడుతుంది. జిఎస్టి కారణంగా పెట్రోలు, డీజిల్ తప్ప మరేవీ రాష్ట్రాలకు అందకుండా పోయాయి. మిగిలిన మేరకైనా రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా సెస్సులు, సర్ చార్జిలను పెంచి వాటికి వాటా లేకుండా చేస్తారు. రాష్ట్రాలపై శతృపూరితంగా దుష్ప్రచారం చేస్తారు. బీహార్‌లో ఎఐఐఎంఎస్ పెట్టడానికి రాష్ట్రాలు సరైన స్థలం చూపించలేదని తెలంగాణలో కిషన్‌రెడ్డి, బీహార్‌లో మన్సుఖ్ మాండవీయ ఒకే విధమైన ఆరోపణలు చేస్తారు. రైల్వేలకు కేరళ సహకరించలేదని మంత్రి అశ్వనీ వైష్ణవ్, కర్ణాటక తోడ్పడలేదని రాజీవ్ చంద్రశేఖర్ తిట్టిపోస్తారు. సంక్షేమ పథకాలను వక్రంగా చిత్రించడమే గాక సహాయ నిరాకరణ చేస్తారు. కర్ణాటక ప్రభుత్వం 'అన్న భాగ్య' పేరిట పథకం చేపట్టి ఎఫ్‌సిఐతో ఒప్పందం కుదర్చుకుంటే కేంద్రం ఒత్తిడి తెచ్చి రద్దు చేయిసుస్తుంది. పంజాబ్‌లో 'ఆప్' పథకాల పైనా కేంద్ర మంత్రులు దాడి చేస్తారు. రాష్ట్రాలకేగాక కేంద్రం అదుపు కూడా లేకుండా 'పి.ఎం కేర్స్' పేరిట భారీ నిధి వసూలు చేస్తారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సహాయం చేసిన వారికి పన్ను, పి.ఎం కేర్స్ అయితే కార్పొరేట్ సామాజిక బాధ్యత అంటూ వివక్షత చూపిస్తారు.
చెదురుమదురుగా కనిపించే ఈ అంశాలన్నీ ఒక్కచోటికి చేర్చి చూస్తే మోడీ సర్కార్ కుటిల వ్యూహం ఏమిటో బోధపడుతుంది. కులం, మతం, జాతి దురభిమానం వంటివి రగిలించడం ఒకవైపు దేశ విశాలత్వాన్ని భిన్నత్వాన్ని చూపే రాష్ట్రాల వనరుల హక్కుల పైన దాడి మరోవైపు చేయడం ద్వారా వాటిని బలహీనపర్చాలి. తద్వారా రాష్ట్రాలలో తమను బలంగా సవాలు చేస్తున్న ప్రతిపక్షాలను దెబ్బ తీయాలి. ఫ్రధాని మోడీనే సర్వశక్తిమంతుడుగా, సకల నిర్ణయ సంధాతగా చూపించాలి. మిగిలిన నేతలనూ పార్టీలనూ ఆఖరుకు ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూడా డమ్మీలను చేయాలి. అయితే చైతన్యవంతులైన భారతీయులు, రాజ్యాంగం, న్యాయస్థానాలు... అన్నిటినీ మించి ప్రజా న్యాయస్థానం అందుకు అవకాశమివ్వడం కల్ల.
- తెలకపల్లి రవి