సాహిత్యం, జర్నలిజం, సైన్స్ తదితర రంగాల్లో తనదైన ముద్ర వేసి..భవిష్యత్ తరాలకు ఆయా అంశాల్లో పాఠ్యగ్రంథాలను అందించిన నిరంతరా న్వేషి.. డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. ఇదివరకటి అనంతపురం జిల్లా నేటి శ్రీసత్యసాయి జిల్లాలోని సోమందేపల్లి మండలంలోని కొనతట్టుపల్లి వారి స్వగ్రామం. కనీస సదుపాయాలు లేని ఆ చిన్న ఊరిలో పుట్టి స్వయంకృషి, సమయపాలనలతో ఎల్లలు దాటి తన బహుముఖ ప్రతిభను చాటారు. ఆకాశవాణిలో కార్యనిర్వాహకుడిగా (ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్) నాగసూరి ప్రస్థానం మొదలైంది. పనాజీ (గోవా), ఢిల్లీ, అనంతపురం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కడప, చెన్నై, తిరుపతి వంటి ప్రధాన ఆకాశవాణి కేంద్రాలలో విధులు నిర్వహించి...శ్రోతలు ఆదరించే ఎన్నో వినూత్న, విలక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నేటికీ అవి శ్రోతలను అలరిస్తుండడం చెప్పుకోదగ్గ విషయం.
ఆకాశవాణి కళాకారులకు చెల్లింపుల విషయంలో జాప్యం లేకుండా చూడడం, ఇంటర్వ్యూకి సంబంధించి ప్రశ్నావళిని సన్నద్ధం చేయడం, శాస్త్రవేత్తలు, సాహితీవేత్తలు, డబ్బింగ్ కళాకారులు, నాటక రంగ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు, సంగీత దర్శకులు, గేయ రచయితలను సమన్వయం చేసి సరైన సమయానికి స్వాగతం పలకడం, ఆత్మీయంగా పలకరించడం, మర్యాదతో వారు ఆకాశవాణి గడప దాటే దాకా దగ్గరుండి ప్రతి చిన్న విషయాన్ని చూసుకోవడం, తానెంత ప్రయాస పడినా వారికి...వారి స్థాయికి సముచిత గౌరవమిచ్చి ఆర్టిస్ట్‌లకు మాత్రం కించిత్ ఇబ్బంది కలగకుండా సర్వం సిద్ధం చేయడంలో నాగసూరిది ప్రత్యేక శైలి. ఆకాశవాణిని రేడియోని ప్రధాన సామాజిక విద్యగా భావించి ఇష్టపడిన పనిలో ఎంతైనా కష్టపడడం నాగసూరిలో వున్న సుగుణం. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదవీ విరమణ వరకూ తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా పూర్తి చేయడంలో ఆ సద్గుణమే కీలక పాత్ర పోషించిందనడం అతిశయోక్తి కాదు.
2016-18 కాలంలో ఆల్ ఇండియా రేడియో తిరుపతి కేంద్రంగా నాగసూరి వేణుగోపాల్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో సైన్స్ గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో అడుగులు వేశారు. విజ్ఞాన కార్యక్రమాలైన...రండి చూసొద్దాం తారామండలం, అడగండి తెలుసుకోండి శీర్షికన ప్రశ్న-సమాధానం వంటి విజ్ఞాన కార్యక్రమాల ఆధారంగా శ్రోతల నుండి ఉత్తరాలు / ఫోన్లు / మెయిళ్ల ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రూపొందించిన కార్య క్రమాలు కచ్చితంగా మెచ్చుకోదగ్గవి. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా దానికి తగినట్లు నాగసూరి వేణుగోపాల్ తీర్చిదిద్దిన కార్యక్రమాలు ఆయనకు ప్రత్యేక పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. 1995 లోనే ''రేడియోస్కోపు' అనే ఆంగ్ల సైన్స్ సంచికా కార్యక్రమం దేశంలో అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమై వారికి మరింత గుర్తింపు తెచ్చింది.
నాగసూరికి రచయిత కావాలనే కోరిక 9,10 తరగతులు చదివే కాలంలోనే మొదలైందంటే ఆయన అభ్యసనం, అధ్యయనాలు ఇప్పటికే స్వర్ణోత్సవాలు జరుపుకున్నట్లు. 62 ఏళ్ల వయసు దాటేసరికి ఆయన ప్రచురించిన పుస్తకాల సంఖ్య 72. వీటిలో ఆయన స్వీయ రచనలే 45 మించి ఉన్నాయంటే ఆయన సమయపాలన ఏపాటిదో అర్థమవకపోదు. 1978లో ఎన్నికల నేపథ్యంలో మొట్టమొదటి రచన 'ఎన్నికల కోలా (హాలా) హలం' నుండి వీరి రచనా ప్రయాణం...జనరంజక విజ్ఞానం, పర్యావరణం, పత్రికా రంగం, టీవీ ఛానళ్ళు, సాహిత్యం, సామాజిక అంశాలు ఇలా అనేక రంగాలకు సంబంధించిన 3 వేలకు పైగా వ్యాసాలతో విస్తరించిందంటే దాని వెనక ఎంత అధ్యయనం, ఆసక్తి, అనురక్తి దాగివున్నాయో అర్ధం చేసుకోవచ్చు. అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసి భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావడానికి ప్రాణ త్యాగం చేసినప్పటి పరిస్థితులపై ఆయన రాసిన వ్యాసాలు ఆలోచింపజేశాయి.
పత్రికా రంగానికి సంబంధించి ఎడిటర్లు ఏమంటున్నారు?, నార్ల బాట, పాత్రికేయపాళి, నవతరానికి నార్ల, మీడియా నాడి, మీడియా స్కాన్, మీడియా వాచ్ ఇలా అనేక పుస్తకాలు రాశారు. పత్రికలు తాము ప్రజల పక్షం అని చెప్పడానికి ప్రయత్నించాలని డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సుతిమెత్తని విమర్శతో గుర్తు చేస్తుంటారు. ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి టీవీ ముచ్చట్లు, ఛానళ్ళు విస్తృతి సీరియళ్ళ వికృతి, వార్తా మాధ్యమాల విశ్వసనీయత, ఛానళ్ళ సందడి టెక్నాలజీ హడావుడి, సమాచారం బాట సంచలనాల వేట, బుల్లితెర విశ్వరూపం, ప్రసార భాషగా తెలుగు, ఛానళ్ళ హోరు భాష తీరు, చర్చనీయాంశాలుగా ఛానళ్ళు, 'ప్రశ్నార్థకమవుతున్న విశ్వసనీయత' వంటి అనేక పుస్తకాలలో టీవీ ఛానళ్ళ తీరుతెన్నులను, బాధ్యతారాహిత్యాన్ని నిర్ద్వంద్వంగా చెప్పారు. జర్నలిజంలో పరిశోధనలు చేయాలనుకునే వారు, అసలేమీ తెలియకుండా వచ్చి జర్నలిజం అంటే ఏంటో తెలుసుకోవాలనుకునేవారికి కూడా ఈ పుస్తకాలు తిరగేస్తే చాలు...జర్నలిజం జీవితానికి కావాల్సిన అనుభవం వస్తుందనడంలో సందేహం లేదు.
కేబుల్ టీవీల రాకతో సినిమా హాళ్ల ప్రాభవం తగ్గలేదు. కంప్యూటర్ల రాకతో నిరుద్యోగ సమస్య పెరగలేదు. పైగా ఉద్యోగావకాశాలు మరింత పెరిగారు కూడా. టేప్ రికార్డర్లు, క్యాసెట్లు వచ్చినపుడు రేడియో అంతరించి పోలేదు. టెలివిజన్ వచ్చినప్పుడూ ఆకాశవాణి మరుగున పడలేదు. నాటి నుంచి నేటి వరకూ ఆకాశవాణి వినే శ్రోతల సంఖ్య తగ్గలేదు. రేడియో వినడం ద్వారా బోలెడు సౌలభ్యాలున్నాయని సవివరంగా నాగసూరి వేణుగోపాల్ రాసిన వ్యాసం 'ఆకాశవాణి'ని అభిమానించే శ్రోతలందరికీ ఓ గుండె ధైర్యం.
ఎన్నో విభిన్న ప్రక్రియల్లో రచనలు చేసిన డా.నాగసూరి వేణుగోపాల్ నేడు ప్రతిష్టాత్మక ''జ్ఞానమద్ది సాహితీ పీఠం'' వారి సాహిత్య సేవా పురస్కారం అందుకోబోతున్న సందర్భంగా వారికి అభినందనలు.
- మంచిపగడం దేవదాస్, ఆకాశవాణి క్యాజువల్ అనౌన్సర్ (హైదరాబాద్ కేంద్రం)
సెల్ : 9966322423