Oct 13,2023 11:57

ప్రజాశక్తి-ఒంగోలు : బిజెపి, వైసిపి ప్రభుత్వాలు విద్యారంగానికి తీవ్ర ద్రోహం చేశాయని సిపిఎం రాష్ట్ర స్థాయి విద్యారంగ సదస్సులో వక్తలు ఆగ్రహించారు. ప్రత్యామ్నాయ విధానాలతోనే విద్యారంగం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.  నాణ్యమైన, ఉచిత విద్య అందించడంలో కేరళ ప్రభుత్వం దేశానికే ఆదర్శమని తెలిపారు.  సిపిఎం ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యాన ఒంగోలులోని అంబేడ్కర్ భవన్ లో 'నేటి విద్యారంగం - ప్రత్యామ్నాయ విధానం'పై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం, పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెయస్ లక్ష్మణరావు పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సుకు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాలు ఆంజనేయులు అధ్యక్షత వహించారు. లక్ష్మణరావు ముఖ్య వక్తగా హాజరై మాట్లాడుతూ... కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాయన్నారు. మేధావులకు కేంద్రాలుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు వైసిపి హయాంలో రాజకీయ పార్టీ కార్యాలయాలుగా మార్చారని మండిపడ్డారు. వాటి అభివృద్ధిని గాలికొదిలేసారని, నిధుల కేటాయింపు తగ్గిందని, విశ్వవిద్యాలయాలలో నాణ్యత కరువయిందని ఆగ్రహించారు. సీట్లు భర్తీ కాకపోవండతో కోర్సులను మూసివేస్తున్నారని, ప్రయివేటు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలపై అజామాయిషి తగ్గడంతో విచ్చలవిడి వ్యాపారంగా యూనివర్సిటీలు మారాయి అన్నారు. అన్నీ విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన ఫీజులు సకాలంలో రాక విద్యార్థులు ఫీజులు భారం మోయాల్సివస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ... నూతన విద్యా విధానం అమలు కారణంగా హై స్కూల్ విద్యలో 3,4,5తరగుతల విలీనం, ఉన్నత విద్యలో నాలుగేళ్ళ డిగ్రీ, విశ్వవిద్యాలయాలకు నిధుల కోత వంటివి ప్రభుత్వ విద్యలో తీవ్ర ప్రభావాన్ని చూపాయని పేర్కొన్నారు. కేంద్రం నుండి వచ్చిన పాఠ్య పుస్తకాలను భోధిస్తున్నారని, ఈ పాఠాలు వాస్తవ చరిత్రను చెరిపి అవాస్తవాలను భోదిస్తున్నాయన్నారు. ఉన్నత విద్యలో కోర్సుల మూసివేతతో ప్రభుత్వ విద్యకాస్త పేదవారికి దూరం చేస్తుందన్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా డిగ్రీలో అడ్మిషన్లు తీవ్ర స్థాయిలో పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ప్రతి నియోజకవర్గంలో ఒకటి ఏర్పాటు చేయాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.... సీపీఎం రాష్ట్ర కమిటీ విద్యారంగానికి సంబందించిన ప్రత్యామ్నాయ విద్యావిధానాన్ని ప్రకటిస్తున్నదని తెలిపారు. ఇప్పటికే సిపిఎం అధికారంలో వున్న కేరళ రాష్ట్రంలో అనుసరించిన విధానం దేశానికి గర్వకారణంగా నిలిచాయి అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినాశక విద్యావిధానం అమలు చేస్తున్నదని అవి రాష్ట్రానికి హానికరం అన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలు మూసివేశారని, పిజీకి రియంబర్స్మెంట్ రద్దు చేశారని విమర్శించారు. యూనివర్సిటీల స్థాయి కిందకు దిగడార్చారని, ప్రవేటు యూనివర్సిటీలకు ద్వారాలు తెరిచి విద్యా వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. సిపిఎం సూచిస్తున్న విధానమే విద్యారంగానికి మేలు చేస్తుందన్నారు. విద్యావేత్త మంగమ్మ కాలేజీ రిటైడ్ ప్రిన్సిపాల్ ఏవి పుల్లారావు మాట్లాడుతూ...
ఇంగ్లీష్ మీడియం పేరుతో తెలుగు మీడియం రద్దు చేయడం దుర్మార్గం అన్నారు. రెండు మీడియాలు సమాంతరంగా కొనసాగించాలని కోరారు. డిగ్రీ కాలేజీలో అన్ని కోర్సులు పెట్టి, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నీ ఏర్పాటు చేయాలని కోరారు. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పేరయ్య మాట్లాడుతూ... విద్యార్థులకు విద్యతో పాటు ఆటలు, పాటలు మానసిక ఉల్లాసానికి అవసరమైన కార్యక్రమాలు వుండాలని అన్నారు. విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివి కొండారెడ్డి తీర్మానాలను ప్రకటించగా పాల్గొన్న ప్రతినిధులు ఆమోదించారు.

  • తీర్మానాలు

1) kg నుండి pg వరకు ఉచిత విద్యను ప్రభుత్వమే అందించాలి.

2) కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం రద్దు చేయాలి, తక్షణం 3,4,5 తరగతుల విలీనం ఆపాలి.

3) ఉన్నత విద్యలో సామాజిక అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలి.

4) యూనివర్శిటీల స్వయంప్రతిపత్తిని కాపాడాలి, నిధులు కేటాయించాలి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి. 

5) ప్రభుత్వ బడులను అభివృద్ధి చేసి కార్పోరేటు విద్యాసంస్థలపై ప్రభుత్వం జోక్యం పెరిగాలి ఫీజు నియంత్రణా చట్టం అమలు చేయాలి.

6) బడ్జెట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి.

7)  వసతి గృహాల విద్యార్ధులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి, సొంత భవనాలు నిర్మించాలి, టుటర్లను నియమించాలి.

8) రద్దు చేసిన ఎయిడెడ్ విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించాలి

9)  జివో నెంబర్ 77 రద్దు చేసి pg కి రియంబర్స్మెంట్ కల్పించాలి.

10)  ప్రకాశం జిల్లా యూనివర్సిటి కి నిధులు కేటాయించి నిర్మాణం చేపట్టాలి. 

11) దేశానికి విద్యలో కేరళ వామపక్ష ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది. విద్యలో 94% అక్షరాస్యత సాధిస్తూ అగ్రభాగాన నిలిచింది కేరళా తరహా విద్యావిధానం ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాలి.

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు కె ప్రసన్న కుమార్, ఎ అశోక్ పాల్గొని మాట్లాడారు. 

సభలో రిటైర్డ్ యం. ఇ. ఓ. శేషయ్య, సీపీఎం నగర కార్యదర్శి  జి రమేష్, జిల్లా నాయకులు కంకణాల రమాదేవి, వి.బాలకోటయ్య, బి.రఘురాం,  సిహెచ్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.