- ప్రజల చైతన్యంతోనే అది సాధ్యం
- సెక్యులరిజం కాపాడటమే సిపిఎం లక్ష్యం
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : దేశానికి బిజెపి ప్రమాదకరంగా మారిందని, అలాంటి పార్టీని గద్దెదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎంపి విజయ రాఘవన్ పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సిపిఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి గెలుపును కోరుతూ శనివారం పట్టణంలోని హౌసింగ్ బోర్డు, మండలంలోని గూడూరు, లక్ష్మీపురం గ్రామాల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లలో ఆయన మాట్లాడారు. మతోన్మాద బిజెపి దేశంలో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి రాజకీయంగా లబ్దిపొందాలని చూస్తుందని విమర్శించారు. దేవుళ్లపై పెట్టిన శ్రద్ధ పేద ప్రజల అభివృద్ధిపై పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మి దేశ సంపదను అదానీ, అంబానీలకు అప్పజెెప్పుతూ సామాన్య ప్రజలు జీవించలేని పరిస్థితికి తీసుకొచ్చారని వాపోయారు. మోడీ అధికారంలోకి వచ్చాకే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, దాంతో పేద ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మారుస్తూ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు కుట్రలు పన్నారని, ఇప్పటికైనా ప్రజలు మేలుకోకపోతే దేశానికి ప్రమాదం ఏర్పడుతుందని చెప్పారు. కేంద్రం, రాష్ట్రం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలు చైతన్యవంతులు కావాలని, ఎన్నికల్లో మోడీతో పాటు కెసిఆర్‌ను ఓడించి గద్దె దింపాలని కోరారు. నిత్యం ప్రజల పక్షాన పేద వర్గాల అభివృద్ధి కోసం జూలకంటి రంగారెడ్డి రాజీలేని పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. జూలకంటి రంగారెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపించినట్టయితే అన్ని వర్గాల ప్రజల సమస్యలపై చట్టసభలో ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారని చెప్పారు. డబ్బు బలంతో వచ్చే బిజెపి, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ అభ్యర్థులను ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. డబ్బుందన్న అహంకారంతో కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి అభ్యర్థులు వాటిని పంచి గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. అలాంటి వారిని గెలిపిస్తే అసెంబ్లీలో చివరి బెంచీలో కూర్చుంటారని, ప్రజాసమస్యలు పరిష్కారం కావాలని తెలిపారు. అదే తనను గెలిపిస్తే ముందు బెంచీలో కూర్చుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్‌నాయక్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, రమ, ఎంవీ రమణ, డబ్బికార్ మల్లేష్, ఐద్వా జిల్లా అధ్యక్షులు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.