Jun 20,2022 15:31

ప్రజాశక్తి-జగదాంబ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘అగ్నిపధ్‌’ పథకాన్ని సిఐటియు జగదాంబ జోన్‌ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనివల్ల దేశ జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొంది. సిఐటియు జగదాంబ జోన్‌ కమిటీ పూర్ణామార్కెట్‌, స్పీంగ్‌ రోడ్డు, టౌన్‌ కొత్తరొడ్డు నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా వై.రాజు జోన్‌ ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి మాట్లాడుతూ నాలుగేళ్ల కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను రిక్రూట్‌ చేయడం వల్ల వృత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్ధ్యాన్ని పెంచడం సాధ్యం కాదని పేర్కొంది. పెన్షన్‌ డబ్బును ఆదా చేసుకోవడం కోసం ఈ పథకం తేవడమంటే మన వృత్తిపరమైన సాయుధ దళాల నైపుణ్యం, సామర్ధ్యంపై తీవ్రంగా రాజీపడడమేనని తెలిపారు. గత రెండేళ్లుగా భారత సైన్యంలో ఎలాంటి రిక్రూట్‌మెంట్‌ లేదు. సాయుధ బలగాల్లోకి రెగ్యులర్‌ సైనికులను రిక్రూట్‌ చేసుకోవడానికి బదులు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల కాంట్రాక్టు సైనికులు తమ నాలుగేళ్ల సర్వీస్‌ తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా మిగిలిపోతారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు తావిస్తుంది. వారు ప్రైవేట్‌ మిలీషియాగా పనిచేసే పరిస్థితివైపు నెట్టబడతారు. ఇప్పటికే తీవ్రమైన ఒడుదుడుకులకు గురవుతున్న మన సామాజిక వ్యవస్థపై దీని పర్యవసానాలు మరింత ప్రమాదకరంగా ఉంటాయిన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం.సుబ్బారావు, అప్పలరెడ్డి, మహేష్‌ తదితరులు ప్రసంగించారు.