Oct 29,2023 11:38

ప్రజాశక్తి-విశాఖ : అసమానతలు లేని అభివృద్ధి కోసం ప్రజా ప్రణాళిక, బస్ యాత్ర గోడపత్రిక విడుదలచేసి ఇంటింటా ప్రచారం తిమ్మరాజుపేట గ్రామంలో ప్రారంభించారు.  అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం రూపొందించిన ప్రజా ప్రణాళిక అమలు కోసం పోరాడాలని సిపిఎం జిల్లా కమిటిసభ్యులు అర్. రాము సీనియర్ నాయకులు కర్రీ. అప్పారావు  మండల నాయకులు కె. సోమునాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబరు 15న ప్రజారక్షణ భేరి పేరుతో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి ముందు మూడు ప్రాంతాల నుంచి బస్సు యాత్రలు బయలుదేరుతాయని, శ్రీకాకుళం జిల్లా మందాస నుండి నవంబర్‌ 2న ప్రారంభమయ్యే బస్సు యాత్ర నవంబర్‌ 5న అచ్చుతాపురం పర్యటిస్తుందని తెలిపారు. విభజన హామీలను అమలు చేయాల్సిన కేంద్ర బిజెపి ప్రభుత్వం ఏ ఒక్కటి అమలు చేయకుండా రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేస్తోంది. ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, కడప ఉక్కు ఫాక్టరీ, రామాయపట్నం మేజర్‌ పోర్టు, రాజధాని నిర్మాణం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు, కడప ఉక్కు,  రైల్వే జోన్‌ వంటి విభజన హామీలలో ఏ ఒక్కటీ అమలు కాలేదు. రాష్ట్ర ప్రజల్ని నిలువునా మోసం చేసిన  బిజెపి అంతటితో ఆగకుండా మన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి గుండెకాయ లాంటి విశాఖ ఉక్కును తెగనమ్మడానికి తయారైంది.  బిజెపి పాలనలో మొత్తం దేశమే అస్తవ్యస్తంగా తయారైంది. బిజెపి బుల్‌డోజర్‌ రాజకీయాలతో అన్నదమ్ముల్లా సమైక్యంగా మెలగవలసిన ప్రజలమధ్య విద్వేషాలు రాజేస్తోంది. కోట్లాదిమంది కార్మికుల హక్కులను కాలరాసే లేబర్‌ కోడ్‌ లను తెచ్చింది. దేశీయ వ్యవసాయానికి, ప్రజల ఆహార భద్రతకు ముప్పు తెచ్చే నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చింది. రైతులు సాగించిన పోరాటం మీద తీవ్ర దమన కాండను ప్రయోగించింది. అయినా వెన్ను చూపని రైతన్నల పోరాట తెగువకు తలొగ్గి  చివరికి ఆ చట్టాలను రద్దు చేసింది కాని ఆ సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరోసారి రైతన్నలకు ద్రోహం చేస్తోంది.  

తాను కూడా ఏమాత్రమూ తీసిపోనంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కార్పొరేట్‌ సేవలో తరిస్తున్నారు. కృష్ట పట్నం, గంగవరం మేజర్‌ పోర్టులతో బాటు రాష్ట్ర ప్రజల సంపదను ఒక్కొక్కటిగా అదానీకి నైవేద్యం పెడుతున్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసి విభజన హామీలకు ఎసరు పెట్టినా కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనడంలేదు. కేంద్రం చెప్పినట్టల్లా తలాడిస్తూ ప్రజలమీద మోయలేని భారాలను వడ్డిస్తున్నాడు. విద్యుత్‌ చార్జీల పెనుభారం ప్రజలపై రుద్దతున్నారు. స్మార్ట్‌ మీటర్లపేర, మోటార్లకు మీటర్లు పేరుతో, ఆస్తిపన్ను నుంచి చెత్త పన్ను దాకా అన్నీ వడ్డింపులలో ప్రజలపై భారాలు మోపుతున్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వాలను నిలదీయడానికి సిపిఎం ప్రజా రక్షణ భేరి మోగిస్తోంది. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం  అవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మరాజుపేట గ్రామశాఖ కార్యదర్శి ఎస్. రా మునాయుడు, హరిపాలెం శాఖ కార్యదర్శి రామ్ కుమార్, సెల్లుబోయిన అప్పారావు, బుద్ధ రంగారావు ప్రజలు పాల్గొన్నారు.