ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం):పాలస్తీనాపై అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ సాగిస్తోన్న నరమేధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ఆదివారం విశాఖ నగరంలో వామపక్ష, పౌర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వందలాది మందితో శాంతి ర్యాలీ జరిగింది. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద సభ నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయాలకు అనుగుణంగా పాలస్తీనా భూభాగాల నుంచి ఇజ్రాయిల్ పూర్తిగా వైదొలగాలని, భారత ప్రభుత్వం తటస్థ వైఖరిని విడనాడి పాలస్తీనా ప్రజలకు సంపూర్ణ మద్దతు ప్రకటించి, సహాయ సహకారాలు అందించాలని నినదించారు. సభలో మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ, జివిఎంసిలో సిపిఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి.గంగారావు, మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం కన్వీనర్ జెవి.సత్యనారాయణమూర్తి, మానవ హక్కుల వేదిక ప్రతినిధి విఎస్.కృష్ణ మాట్లాడుతూ అమెరికా మద్దతుతోనే పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ అత్యంత భయానకమైన దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. యుద్ధ నియమాలకు వ్యతిరేకంగా నివాస ప్రాంతాలపైనా, చివరికి ఆస్పత్రులపైనా, స్కూళ్లపైనా దాడులు చేస్తోందన్నారు. యుద్ధ బాధిత ప్రజలకు యుఎన్‌ఒ సహాయక చర్యలను సైతం అడ్డుకుంటోందని తెలిపారు. అమెరికా తన సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ఇజ్రాయిల్‌ను పూర్తిగా బలపరుస్తోందని విమర్శించారు. మధ్యప్రాచ్యంలో తమ ఆధిపత్యాన్ని పూర్తిగా నెలకొల్పుకునేందుకు ఇజ్రాయిల్‌ని అమెరికా, బ్రిటన్‌లు సృష్టించాయన్నారు. అక్కడున్న ఆయిల్ వనరులను కాజేయడానికి, మధ్యప్రాచ్య దేశాల్లోని పాలకులను లోబర్చుకోవడానికి, వ్యూహాత్మకంగా పట్టు సాధించడానికి ఇజ్రాయిల్‌ను ఉపయోగించుకుంటూ ఒక టెర్రరిస్టు దేశంగా అమెరికా మార్చేసిందని విమర్శించారు. ప్రపంచంలోని పౌర సమాజమంతా ఇజ్రాయిల్ దుర్మార్గాన్ని ఖండిస్తున్నప్పటికీ ఆ దేశం వెనక్కు తగ్గకపోవడం దారుణమన్నారు. గత నెల 27న ఐక్యరాజ్యసమితి తన జనరల్ అసెంబ్లీ సమావేశాన్ని జరిపి పాలస్తీనాపై యుద్ధాన్ని వెంటనే ఆపాలని తీర్మానం చేసిందని, కాల్పుల విరమణ ప్రకటించాలని కోరిందని తెలిపారు. 120 దేశాలు అక్కడ జోర్డాన్ ప్రతిపాదించిన తీర్మానాన్ని బలపరచగా, 14 దేశాలు మాత్రమే వ్యతిరేకించాయని గుర్తు చేశారు. 45 దేశాలు తటస్థ వైఖరిని అవలంభించాయని, భారత్ దానిలో ఉండడం శోచనీయమని అన్నారు. అలీన దేశాల విధానాన్ని కలిగి ఉన్న భారతదేశం చరిత్ర పొడవునా పాలస్తీనాకే మద్దతుగా నిలబడిందని తెలిపారు. కానీ, మోడీ ప్రభుత్వం అమెరికా అనుకూల విధానంలో భాగంగా జాత్యాహంకార ఇజ్రాయిల్‌కు వంతపాడుతోందని విమర్శించారు. దేశ ప్రజానీకం ఈ వైఖరిని ఖండించాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో విశాఖలోని పౌర ప్రజా సంఘాలు, భారత్ బచావో సంస్థ, జర్నలిస్టు, ముస్లిం మిత్ర సంఘాలు భాగస్వామ్యమయ్యాయి. పిఒడబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి ఎం.లక్ష్మి, ప్రజా సంఘాల నాయకులు శరత్ కుమార్, జుబేర్, అరుణ, పి.చంద్రశేఖర్, రెహమాన్, ఎం.వెంకటేశ్వర్లు, కె.నిర్మల, ఇ.లక్ష్మి, ఎమ్‌డి షరీఫ్, నజీర్ అహ్మద్, రాధ, పుష్ప, మధు తదితరులు పాల్గొన్నారు.