Apr 01,2023 15:02

ప్రజాశక్తి-విశాఖ : ఏప్రిల్‌`5న ఢిల్లీలో కార్మిక, కర్షక సంఘర్ష్‌ ర్యాలీకు విశాఖపట్నం కార్మికులు బయలుదేరి వెళ్ళారు. సుమారుగా వంద మంది బిల్డింగ్‌, స్కీమ్‌, అసంఘటిత రంగ కార్మికులు వెళ్ళారు. వీళ్ళందరికీ సిఐటియు జిల్లా కమిటీ అభినందనలు తెలియజేసింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బి.జగన్‌ అభినందనలు తెలియజేసారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మవద్దు అని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ప్రభుత్వ రంగ సంస్థలు, సర్వీసుల ప్రైవేటీకరణ ఆపాలి.

ప్రభుత్వ రంగ సంస్థలను లీజుకు ఇచ్చే పద్ధతులను రద్దు చేయాలని, కార్మికులకు నష్టం చేసే 4లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాలని,  కనీస వేతనం నెలకు రూ. 26 వేలు, కనీస పెన్షన్‌ రూ. 10 వేలు చెల్లించాలని, స్కీమ్‌ వర్కర్లు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, టైమ్‌ స్కేల్‌, డైలీవేజ్‌, కంటింజెంట్‌ ఉద్యోగులు, కార్మికులను పర్మినెంట్‌ చేయాలని,  సీపీఎస్‌ రద్దు చేయాలని, ఓపిఎస్‌ ను పునరుద్ధరణ చేయాలని, కనీస మద్దతు ధర కల్పించాలని, పంటల సేకరణకు గ్యారెంటీ చేస్తూ చట్టం చేయాలని, పేద, మధ్య తరగతి రైతులు, వ్యవసాయ కార్మికుల రుణాల రద్దు చేయాలని, వీరందరికి 60 సంవత్సరాల తర్వాత పెన్షన్‌ ఇవ్వాలని,  గ్రామీణ వ్యవసాయ కార్మికుల ఉపాధికి రక్షణ కల్పించాలని, ఉపాధి హామి చట్టం క్రింద సం॥రానికి 200 రోజులు పని కల్పించాలని, రోజుకు 600 రూ॥లు కనీస వేతనం చెల్లించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, జాతీయ పట్టణ ఉపాధి గ్యారంటీ చట్టం చేయాలని, అధిక ధరలను అరికట్టాలని, ఆహార, నిత్యావసరాలపై జీఎస్టీ రద్దు చేయాలని, పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌పై ఎక్సైజ్‌ పన్ను తగ్గించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను అందరికీ అందుబాటులోకి తేవాలని,  నిత్యావసర సరుకులను సరఫరా చేయాలని, అందరికీ గృహ సౌకర్యం కల్పించాలని, ఆదాయ పన్ను పరిధిలో లేని కుటుంబాలకు ఆహార, ఆదాయ మద్దతు ఇవ్వాలని, అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని,  సమాచారం కూడా ఇవ్వకుండా నిర్వాసితులను ఖాళీ చేయించటానికి అధికారం ఇచ్చే అటవీ సంరక్షణ చట్టం మరియు దాని రూల్స్‌ మార్పులను ఉపసంహరించుకోవాలని, బలహీన వర్గాల ప్రజల అణచివేతను నిలపివేయాలని, వారికి సామాజిక న్యాయం కల్పించాలని, అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం కల్పించాలని, నూతన విద్యా విధానం - 2020 రద్దు చేయాలని, అత్యంత ధనవంతులపై పన్నులు పెంచాలని, కార్పొరేట్‌ పన్ను పెంచాలని. సంపద పన్ను ప్రవేశ పెట్టాలని పై డిమాండ్ల సాధనకు ఏప్రిల్‌ 5 కార్మిక సంఘర్ష్‌ ర్యాలీ జయప్రదం చేయడానికి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు బి.జగన్‌, తులసి, అప్పలరాజు, అనసూయ,  నాయకులు బి.వెంకటరావు, శంకరరావు, దేవి, బృంద, శ్రీను తదితరులు పాల్గొన్నారు